చైనా యాప్ లపై నిషేధాన్ని స్వాగతించిన పేటీఎం వ్యవస్థాపకుడు

  • Published By: bheemraj ,Published On : July 1, 2020 / 03:25 AM IST
చైనా యాప్ లపై నిషేధాన్ని స్వాగతించిన పేటీఎం వ్యవస్థాపకుడు

టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సేవలందిస్తున్న పేటీఎం యాప్ ను వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే భారత సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇదో మొబైల్ ఇంటర్నెట్ కంపెనీ. దీనిలో చైనా కంపెనీలైన ఆలీబాబా, యాంట్ ఫైనాన్స్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయినప్పటికీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చైనా యాప్ ల నిషేధంపై స్పందించడం విశేషం. మంగళవారం (జూన్ 30, 2020) ఆయన ట్వీట్ చేస్తూ దేశ ప్రయోజనాల విషయంలో ఇదో ధైర్యంతో కూడిన చర్యని అన్నారు.

భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా దోహదం చేస్తుందని చెప్పారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ప్రజలకు కొత్త ఆవిష్కరణలను అందించాల్సిన సమయమిదేనని అన్నారు.