Bharat Jodo Yatra: కాశ్మీర్‌లో స్వచ్చమైన గాలిలా రాహుల్ యాత్ర.. భారత్ జోడోయాత్రలో మెహబూబా ముఫ్తీ..
జమ్మూకాశ్మీర్‌లోని అవంతిపోరాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీర్‌లో స్వచ్ఛమైన గాలిలా వస్తుందని పేర్కొన్నారు.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరింది. శుక్రవారం భద్రతా కారణాల రిత్యా రాహుల్ పాదయాత్రను నిలిపివేశారు. పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని, ఈ క్రమంలో యాత్రను నిలిపివేశామని రాహుల్ తెలిపారు. శుక్రవారం రాహుల్ 500 మీటర్లు నడిచారు. జమ్ము ప్రాంతంలోని బనిహాల్ నుంచి జవహార్ లాల్ సొరంగం గుండా, కాజీగుండ్‌లోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. శనివారం రాహుల్ తన యాత్రను యథావిధిగా కొనసాగించారు. జమ్మూకాశ్మీర్ లోని అవంతిపోరాలో జరుగుతున్న యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ శనివారం రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.
యాత్రలో భాగంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. అదేవిధంగా రాహుల్ వెంట యాత్రలోఉన్న ప్రియాంక గాంధీ వాద్రాను ఆలింగనం చేసుకొని అభినందించారు. అనంతరం వారితో కలిసి మెహబూబా ముఫ్తీ పాదయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు ఆమె ఆసక్తికర ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీర్ లో స్వచ్ఛమైన గాలిలా వస్తుంది. 2019 తర్వాత కాశ్మీరీలు ఇంత పెద్ద సంఖ్యలో తమ ఇళ్ల నుంచి బయటకు రావటం ఇదే మొదటి సారి అని ఆమె పేర్కొన్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో నడవటం గొప్ప అనుభవం అని ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు.
Rahul Gandhi’s yatra comes like a breath of fresh air in Kashmir. It is the first time since 2019 that Kashmiris have come out of their homes in such massive numbers it. Was a great experience to walk with him. pic.twitter.com/WigfdOBoPS
— Mehbooba Mufti (@MehboobaMufti) January 28, 2023
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్ లో ముగుస్తుంది. యాత్ర ముగింపు సందర్భంగా షేర్ ఏ కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించి భారత్ జోడో యాత్రను ముగిస్తారు. ఇదిలాఉంటే రాహుల్ గాంధీకి భద్రత విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కేంద్ర హోమంత్రికి లేఖ రాశారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని, అందువల్ల భద్రత కల్పించాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. శుక్రవారం భద్రతాలోపంతో భారత్ జోడో యాత్ర నిలిచిపోయింది. ఈ క్రమంలో మల్లిఖార్జున్ ఖర్గే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు భద్రత విషయంపై లేఖ రాశారు.