వాడేది ఒక్క లైటు.. కరెంట్ బిల్లు మాత్రం రూ. 12వేలు

వాడేది ఒక్క లైటు.. కరెంట్ బిల్లు మాత్రం రూ. 12వేలు

Electricity Bill

కరెంట్ బిల్లు రూ. 12వేల 500.. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. వాళ్లింట్లో ఫ్రిడ్జ్, ఏ/సీ, వాషింగ్ మిషన్, టీవీ ఇలా ఉంటే తప్ప అంత కరెంట్ బిల్లు రాదు అనుకుంటాం కదా? కానీ వచ్చింది.. ఓ పేదవాడి ఇంటికి ఒక్క లైటు మాత్రమే ఉండే గూడుకు కరెంట్ బిల్ రూ. 12,500 వచ్చింది.. ఇదేంటని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే మాకేం తెలియదు బిల్ మొత్తం కట్టాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో రోడ్డెక్కిన బాధితులు.. విద్యుత్ శాఖామంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ ఘటన ఒడిశాలో కలహండిలో నివాసం ఉండే కొంతమంది పేదలకు విపరీతంగా కరెంట్ బిల్ వేశారు. దింతో వారు రోడ్డెక్కారు. తమకు కరెంట్ బిల్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఒడిశా విద్యుత్ శాఖామంత్రి దిబ్యా శంకర్ మిశ్రా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా కరుణకర్ సాగర్ అనే గ్రామస్తుడు మాట్లాడుతూ.. “నేను చాలా పేదవాడిని.. ఇంట్లో ఒక్క బల్బును మాత్రమే ఉపయోగిస్తున్నాను. రూ.300 నుంచి 500 రూపాయల వరకు వస్తే చెల్లించగలను.

కానీ, నాకు ఇప్పుడు రూ .12,500 వచ్చింది ఎలా కట్టగలను. అసలు అంత బిల్లును నేను ఎందుకు చెల్లించాలి? బల్బ్ వెలిగించటానికి ఎంత ఖర్చవుతుంది? కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా రూ.500 బిల్లు వచ్చిందని తీసుకున్నారు. ఇప్పుడు 5 నుండి 6 నెలల తరువాత వచ్చి రూ .12,500 కరెంట్ బిల్లు వచ్చింది కట్టమంటూ డిమాండ్ చేస్తున్నారు” అంటూ వాపోయారు. గతంలో ఎప్పుడూ ఇంత బిల్లు రాలేదని, ఇప్పుడు ఏకంగా రూ.12,500 వచ్చిందని అదికూడా ఒకేసారి కట్టాలంటూ విద్యుత్ శాఖా అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దీనిపై స్పందించి తమ బిల్లులను మాఫీ చేయాలనీ కోరుతున్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యప్రజలపై భారం వేస్తుందని మండిపడ్డారు. BPL కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే దీనిపై దీక్ష చేపడతామని అన్నారు. ఉజ్వల పథకం కింద వారికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ పథకం కింద విద్యుత్ లైన్ వచ్చింది అంటే వీరు నిరుపేదలని అర్ధం. అయినా కరెంట్ బిల్ రూ.12వేల 500 వెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.