దమ్ము చూపిస్తున్నారు : పెప్సీ కంపెనీతో ఆలుగడ్డ రైతుల పోరాటం

దమ్ము చూపిస్తున్నారు : పెప్సీ కంపెనీతో ఆలుగడ్డ రైతుల పోరాటం

కష్టం చేసిన వాడి నోటికాడ కూటిని లాక్కోవాలని చూస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. నెలల తరబడి నేలనే నమ్ముకుని సాగు చేసిన పంట చేతికొచ్చాక.. మాదేనంటూ మింగేయాలనుకుంటున్నాయి. పంటపై కూడా పేటెంట్ రైట్స్ అని దబాయిస్తూ..  రైతులనే నష్టపరిహారం చెల్లించమంటున్నారు. అనుమతి లేకుండా పంటను పండించారనే సాకుతో.. చెప్పిన ధరకే ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది పెప్సికో కంపెనీ. 

గుజరాత్‌లోని రైతులు FL 2027అనే రకం బంగాళ దుంపలను సాగు చేశారు. పంట చేతికి వచ్చింది. లాభాలు వస్తాయని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో (lays) ఉత్పత్తుల కంపెనీ పెప్సికో  అహ్మదాబాద్ కమర్షియల్ కోర్టులో కేసు వేసి.. పంటను తమకిచ్చేయాలనే వాదన తీసుకొచ్చింది. 

ఈ రకం పంటను 2008వ సంవత్సరం నుంచి తమకే చెందుతుందని వాదిస్తోంది కూల్ డ్రింక్ కంపెనీ పెప్సీ. అలా కాకుండా గుజరాత్ రైతులు సాగు చేయడంపై తమకు రూ.4.2కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని పెప్సికో కంపెనీ కేసు వేసింది. మా అనుమతి లేకుండా ఇతరులు పండించకూడదని.. వేసిన పంటను వెంటనే నాశనం చేయాలి లేదా తమకిచ్చేయాలని పెప్సికో తరపు లాయర్ వాదించారు.

రైతుల తరపున వాదిస్తున్న లాయర్ కోర్టులో ఉన్న కేసును జూన్ 12కు వాయిదా వేయాలని కోరారు. 2001 రైతుల హక్కు రక్షణ చట్ట ప్రకారం.. రైతులు ఏ రకం పంటనైనా సాగు చేసుకోవచ్చు. ఎలాంటి విత్తనాలనైనా అమ్ముకోవచ్చు. దీని ప్రకారం.. పంట, దాని వల్ల వచ్చే లాభాలు రైతులకే చెందుతాయని వాదించారు.

అన్ని వాదనలు విన్న న్యాయస్థానం ఇంకా తీర్పు చెప్పలేదు. అయితే వాదనలు మాత్రం పెప్సీ కంపెనీకి వ్యతిరేకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో రచ్చ అయ్యింది. రైతులకే మా మద్దతు అంటూ నెటిజన్లు ట్రోల్  చేయటం మొదలుపెట్టారు. తీర్పు కూడా వ్యతిరేకంగా వస్తుందనో లేక రైతులకు మద్దతు పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఏదైతే ఏం..  పెప్సికో కంపెనీ కూడా రాజీకి వచ్చింది.

పంట విత్తనాలు బయటకు పోకుండా ఉండాలనే కండీషన్ తో.. 50 కిలోల బంగాళదుంపలకు రూ.1350 ధర నిర్ణయించింది. పెప్సీ కంపెనీ ఆఫర్ ను తిరస్కరించారు రైతులు. మరింత ధర కావాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మా ఇష్టమొచ్చిన పంట పండించుకుంటాం అంటున్నారు.

పెప్సికో ఈ రకమైన పంటను దేశవ్యాప్తంగా 24వేల మంది రైతులతో సాగు చేయించి.. లేస్ తయారు చేస్తోంది.