బాబోయ్ : పైపైకి చమురు ధరలు

  • Edited By: madhu , January 20, 2019 / 02:50 AM IST
బాబోయ్ : పైపైకి చమురు ధరలు

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా దిగి వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు హమ్మయ్యా అనుకున్నాడు. ఇటీవలే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తగ్గుముఖం పడుతున్నాయి..మరలా పెరగవు కదా..అని అనుకున్న సామాన్యుడి అనుమానం నిజమైంది. మరలా చమురు ధరలు పైపైకి వెళుతున్నాయి. ఏమనంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయనే కారణాలు చెబుతున్నారు. 
ప్రభుత్వ ఇంధన విక్రయ సంస్థలు జనవరి 19వ తేదీ శనివారం లీటర్ పెట్రోల్‌కు 19 పైసలు పెంచాయి. డీజిల్‌పై 21 పైసలు వడ్డించడం గమనార్హం. ఇలా పెరుగుతూ ఉండడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.03కి చేరుకోగా..డీజిల్ ధర రూ. 70.84కి చేరుకుంది. పెట్రోల్‌కి సమానంగా డీజిల్ ధర చేరుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. న్యూఢిల్లీలో పెట్రోల్ 17 పైసలు పెరగగా డీజిల్ మరో 19 పైసలు పెరిగింది. అంటే అక్కడ పెట్రోల్ రూ. 70.72, డీజిల్ రూ. 65.16కి చేరుకుంది. మొత్తంగా 10 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 2.50 పెరగగా..డీజిల్ మరో రూ. 3.20 పెరిగింది.