మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రికార్డులు నమోదు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రికార్డులు నమోదు

petrol, diesel prices hike again: దేశంలో గత వారం రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 7వ రోజు (సోమవారం, ఫిబ్రవరి 15,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న లీటర్ కు 20 నుంచి 34 పైసలు పెంచిన చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.88.99కు చేరగా, లీటర్‌ డీజిల్‌ రూ.79.35కు పెరిగింది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో రూ.95 మార్కును తాకాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.46 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.35 గా ఉంది. ఇక హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర గరిష్ఠ స్థాయిలో నమోదైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.53 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.55 గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో భారత్‌లో నూ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. కాగా, వరుసగా పెరుతున్న చమురు ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తమ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఇంధన ధరలపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. పెట్రో ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఓవైపు పెట్రో ధరలు మండిపోతుంటే, వంట గ్యాస్ కూడా గుదిబండగా మారింది. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ఇలా ధర పెరగడం ఈ నెలలో రెండోసారి. అటు ఇంధన ధరలు, ఇటు వంట గ్యాస్ సిలిండర్ ధర.. రెండూ పెరుగుతుండటంతో సామ్యానులు విలవిలలాడిపోతున్నారు.