వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రో ధరలు

వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రో ధరలు

petrol, diesel prices hiked for third day: చమురు ధ‌ర‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వాహనదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజూ(ఫిబ్రవరి 11,2021) చ‌మురు ధ‌ర‌లు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 32 పైస‌ల చొప్పున పెంచాయి చ‌మురు కంపెనీలు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీట‌రుకు 25 పైస‌లు, డీజిల్‌పై 30 పైస‌లు పెరిగింది. దీంతో అక్క‌డ లీట‌రు పెట్రోలు రూ.87.85, డీజిల్ రూ.78.03కి చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర మంట పుట్టిస్తోంది. అక్కడ లీట‌ర్ పెట్రోల్ ధర రూ.94.36, డీజిల్ రూ.84.94కి చేరింది. హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర 26 పైస‌లు పెరిగి రూ.91.35కి చేరింది. అలాగే, డీజిల్ ధ‌ర లీట‌ర్ కి 32 పైస‌లు పెరిగి రూ.85.11కి పెరిగింది. గుంటూరులో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.93.93, డీజిల్ ధ‌ర రూ.87.20గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటరు పెట్రోల్ ధ‌ర రూ.93.73కి, లీట‌రు డీజిల్ ధ‌ర రూ.87కి పెరిగింది.

అంతర్జాతీయ, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రో ధరలను రోజువారీగా సవరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు చమురు పై ట్యాక్సులు పెంచడం ధరల పెరుగుదలకు మరో కారణం. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో చమురు ధరలపై అగ్రిసెస్ విధించిన విషయం విదితమే.

రోజురోజుకి పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే బండి బయటకు కష్టమే అంటున్నారు. పెట్రో ధరలు ఇంతలా పెరుగుతూ పోతే, ఇక బతికేది ఎలా అని వాపోతున్నారు.