Petrol Price : బిగ్ షాక్.. రూ.200 కానున్న లీటర్ పెట్రోల్ ధర..?

దేశంలో వాహనదారులకు బిగ్ షాక్ తప్పదా? రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా? లీటర్ పెట్రోల్ ధర రూ.200 అవుతుందా? అంటే అవుననే అంటున్నారు..

Petrol Price : బిగ్ షాక్.. రూ.200 కానున్న లీటర్ పెట్రోల్ ధర..?

Petrol Price

Petrol Price : దేశంలో వాహనదారులకు బిగ్ షాక్ తప్పదా? రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా? లీటర్ పెట్రోల్ ధర రూ.200 అవుతుందా? అంటే అవుననే అంటున్నారు ఇంధన నిపుణులు నరేంద్ర తనేజా.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలను తాకుతుండటంతో ఆందోళన చెందిన సామాన్యులకు దీపావళి పర్వదినం సందర్భంగా కేంద్రం తీపి కబురు తెలిపిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి భారాన్ని కాస్త దింపింది. దీంతో పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి. అయితే, ఈ ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు నరేంద్ర తనేజా అంటున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరుగుతాయని ఆయన అంచనా వేసి బాంబు పేల్చారు.

దేశంలో రానున్న నెలల్లో ఇంధన ధరల పెరుగుదల గురించి నరేంద్ర తనేజా షాకింగ్ విషయాలు తెలిపారు. 2023 నాటికి మరో రూ.100 పెరిగి లీటర్ పెట్రోల్ రూ.200 అవుతుందని ఆయన అంచనా వేశారు. దేశంలో వినియోగించే చమురులో 86శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి.. వీటి ధరలు కేంద్రం నియంత్రనలో ఉండవన్నారు. డిమాండ్-సరఫరాలో సమతుల్యం లేనప్పుడల్లా ధరలు పెరుగుతాయని తనేజా వివరించారు.

EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

”దేశీయ అవసరాల్లో 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌-సప్లయ్‌కి అనుగుణంగా ధరలు మారుతుంటాయి. ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభమే కారణం. గిరాకీకి అనుగుణంగా సరఫరా లేకపోతే.. అనివార్యంగా ధరలు పెరుగుతాయి. అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ఓ కారణం. కేవలం పునరుత్పాదక, హరిత ఇంధనంపైనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కొన్ని నెలల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయి. 2023 నాటికి లీటర్‌ ముడి చమురు ధర మరో రూ.100 ఎగబాకే అవకాశం ఉంది” అని తనేజా విశ్లేషించారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కనిష్ఠానికి చేరినప్పుడు కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచి ఆదాయం సమకూర్చుకుందని తనేజా అన్నారు. ఇప్పుడు ధరలు మళ్లీ పెరుగుతుండడంతో తగ్గించిందని తెలిపారు. ఇది సహజ ప్రక్రియ అన్నారు. అలాగే గతకొన్ని నెలల జీఎస్టీ వసూళ్లు.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తగ్గి.. సుంకం తగ్గింపునకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తేనే.. సామాన్యులకు నిజమైన ఊరట లభిస్తుందని తనేజా తేల్చి చెప్పారు.

Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

దేశంలో రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని, లీటర్ పెట్రోల్ ధర రూ.200 అవుతుందని ఇంధన నిపుణులు తనేజా చేసిన వ్యాఖ్యలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ అంచనాలు సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన నింపాయి.