లీటర్ పెట్రోల్ రూ.150..? ఇక వాహనాలు అమ్ముకోవాల్సిందేనా?

లీటర్ పెట్రోల్ రూ.150..? ఇక వాహనాలు అమ్ముకోవాల్సిందేనా?

దేశంలో ఇంధన ధరల మోత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు ధరను చేరుతున్నాయి. వరుసగా 10వ రోజు(ఫిబ్రవరి 18,2021) కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలుపై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.

దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఇలా రోజుకు 30 పైసల చొప్పున పెట్రోల్ ధర పెరుగుతూ పోతే, మరో ఆరు నెలల్లో లీటరుకు 150 రూపాయలకు చేరే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రో బాదుడు సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే.

తాజా పెంపుతో దేశం రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.89.88కు చేరగా, డీజిల్ ధర రూ. 80.27గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.34 దగ్గర రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ ధర రూ. 87.32 గా ఉంది.

హైదరాబాద్‌ లో పెట్రోల్ ధర రూ.93.64, డీజిల్ ధర రూ.87.52
అమరావతిలో పెట్రోలు ధర రూ. 96.03, డీజిల్‌ ధర రూ. 89.60
కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 91.11, డీజిల్ ధర రూ.83.86
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.98, డీజిల్ ధర రూ.85.31
బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.89, డీజిల్ ధర రూ. 85.09

పది రోజుల్లో పెట్రోల్‌పై రూ.2.93 పెర‌గ‌గా, డీజిల్‌పై రూ.3.14 పెర‌గ‌డం గ‌మ‌నార్హం. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్‌లో లీటర్‌ పెట్రోల్ ఇప్ప‌టికే రూ.100కు చేరింది. ఆ రాష్ట్ర‌ పెట్రోల్‌ డీలర్ల సంఘం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం మిగ‌తా వ‌స్తువుల పెరుగుద‌లపై కూడా ప‌డుతుండ‌డంతో సామాన్యుడికి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేవు.

పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డెక్కే ముందుకు ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కాగా, ఇప్పటికే పలు చోట్ల పెట్రోల్ ధర సెంచరీ కొట్టగా.. అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 మార్కు చేరబోతోంది. ఈ ధరలు చూసి కొత్త బండి కొనడం కాదు కదా, ఉన్న వాహనాలు అమ్ముకోకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చరిత్రలో మొదటిసారి పెట్రోల్ ధర మూడంకెల మార్క్‌కు చేరుకుంది. పెట్రోల్ ధర రూ.100 దాటింది. రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఈ రికార్డ్ క్రియేట్ అయింది. పెట్రోల్ ధర 34 పైసలు పెరగడంతో ధర రూ.100 దాటింది. అక్కడ ఫిబ్రవరి 17న లీటర్ పెట్రోల్ రూ.100.13 ధరకు చేరుకుంది. రాజస్తాన్‌లో ఈ రికార్డ్ ఫిబ్రవరి 17న నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరుగుతూ పోతే.. రాజస్తాన్‌లో నమోదైన ఈ రికార్డు దేశంలోని ఇతర ప్రాంతాల్లో నమోదు కావడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చని వాహనదారులు అంటున్నారు.