తొక్కలో సెక్యూరిటీ : ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర 42 కోట్ల ఫేస్ బుక్ ఫోన్ నెంబర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : September 5, 2019 / 10:54 AM IST
తొక్కలో సెక్యూరిటీ : ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర 42 కోట్ల ఫేస్ బుక్ ఫోన్ నెంబర్లు

కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎపిసోడ్ ముగిసిన ఏడాదికి ఫేస్ బుక్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలను ఫేస్ బుక్ మరోసారి బయటపెట్టిన విషయం కలకలం రేపుతోంది. 

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం… ఓ ఆన్‌లైన్ డేటాబేస్ 42 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల ఫోన్ నంబర్లను కలిగి ఉంది. ఇందులో 13 కోట్ల మంది అమెరికా వినియోగదారులు, 1.8 కోట్ల మంది బ్రిటన్ వినియోగదారులు, 5 కోట్ల మందికి పైగా వియత్నాం వినియోగదారుల ఫేస్ బుక్ ఫోన్ నెంబర్లను ఆ డేటా బేస్ కంపెనీ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ డేటా బేస్ కంపెనీ పాస్ వర్డ్ సెక్యూరిటీ లేని ఓ ఆన్ లైన్ సర్వర్ లో ఈ వివరాలు స్టోర్ చేయబడ్డాయి.

అంతేకాకుండా యూజర్ల యుూనిక్ ఫేస్ బుక్ ఐడీ, అకౌంట్ లో లిస్ట్ అయిన్ ఫోన్ నెంబర్లను కూడా కలిగి ఉందని అమెరికాకు చెందిన ఆన్ లైన్ పబ్లిషర్ టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. అనేక మంది ప్రముఖులతో సంబంధం ఉన్న ఫోన్ నంబర్లను డేటాబేస్ లొకేట్ చేయగల్గుతున్నట్లు జీడీఐ ఫౌండేషన్ కి చెందిన సెక్యూరిటీ రీసెర్చర్, మెంబర్ సన్యమ్ జైన్ తెలిపారు. 

ఈ విషయం వెలుగులోకి రావడంతో దీనిపై ఫేస్ బుక్ స్పందించింది. విచారణ జరుగుతున్నట్లు తెలిపింది. ఫేస్ బుక్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ డేటా పాతదని, ఫోన్ నెంబర్లను ఉపయోగించి యూజర్లను కనిపెట్టగలిగే విధానాన్ని మారుస్తూ.. గత సంవత్సరం ఫేస్ బుక్ లో మార్పులు చేసే ముందు ఈ సమాచారం పొందినట్లు తెలుస్తుందని అన్నారు. 

అయితే ఎవరి డేటా బయటపడిందో ఫేస్ బుక్ కంపెనీ బయటపెట్టేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ డేటా లీకేజ్ ద్వారా సిమ్ స్వాపింగ్, స్పామ్ కాల్స్ వంటి వాటితో కోట్ల మంది యూజర్లు రిస్క్ లో పడ్డారు. యూజర్ ఐడీ, ఫోన్ నంబర్స్ కలిగి ఉండటం ద్వారా ఆన్ లైన్ దొంగలు ఒకే నంబర్‌తో అనుసంధానించబడిన ఏదైనా ఇంటర్నెట్ ఆధారిత అకౌంట్ కోసం పాస్‌వర్డ్‌లను  రీసెట్ చేయడానికి కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇదే కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి భారత్ యూజర్ల డేటా వివరాలు వెల్లడి కాలేదు.