Places of Worship Shut: కరోనా ఎఫెక్ట్, ప్రార్థనా మందిరాలు మూసివేత

కరోనా వైరస్‌ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి మళ్లీ కఠిన చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

Places of Worship Shut: కరోనా ఎఫెక్ట్, ప్రార్థనా మందిరాలు మూసివేత

Maharashtra Corona

Places of Worship Shut : కరోనా వైరస్‌ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి మళ్లీ కఠిన చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు జిల్లాలోని ప్రార్థనా మందిరాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. భక్తుల రద్దీ నియంత్రించడం ద్వారా వైరస్‌ను కట్టడి చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయితే, రోజువారీ జరగాల్సిన పూజా కార్యక్రమాలు జరిగేలా ఆయా ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ విపిన్‌ ఇతంకర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

నాందేడ్‌ జిల్లాలో దుకాణాలకు సైతం పలు నిబంధనలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని ఉత్తర్వులు జారీ చేశారు. నాందేడ్‌లో గురువారం(మార్చి 18,2021) 625 కొత్త కేసులు రాగా.. ముగ్గురు కరోనాతో మరణించారు. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసులు 29వేల 145కి చేరగా.. మరణాల సంఖ్య 627కి పెరిగింది. ప్రస్తుతం అక్కడ 3,727 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కరోనా కొత్త కేసుల్లో అత్యధికం ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. గురువారం(మార్చి-18,2021) రాష్ట్రంలో కొత్తగా 25వేల 833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. 2021 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క నాగ్‌పూర్ జిల్లాలోనే 3వేల 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో గడచిన 24 గంటల్లో 2,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఎనిమిది మంది కరోనాతో చనిపోయారు. నాగ్‌పూర్, ముంబై తరువాత పుణెలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరోమారు లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కొట్టిపారేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడానికి సిద్ధంగా ఉందని.. ముంబైలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23లక్షల 96వేల 340కు, మరణాల సంఖ్య 53వేల 138కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21లక్షల 75వేల 565కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 66వేల 353 యాక్టివ్ ‌కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.