Plasma Therapy : ప్లాస్మా థెరపీకి కొత్త మార్గదర్శకాలు

Plasma Therapy : ప్లాస్మా థెరపీకి కొత్త మార్గదర్శకాలు

Plasma Therapy

Plasma Therapy :  కరోనా ట్రీట్‌మెంట్‌లో కీలకంగా భావించిన ప్లాస్మా థెరపీపై నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు ప్లాస్మా థెరపీతో ప్రయోజనమే లేదని తేల్చేశారు. దీంతో ప్లాస్మా థెరపీని నిలివేసేందుకు కేంద్రం మార్గ దర్శకాలు రెడీ చేస్తోంది. రెండు రోజుల్లో ప్లాస్మా థెరపీపై కీలక గైడ్‌లైన్స్ విడుదల చేయనుంది.

కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైనవారికి ఇప్పటివరకు ప్లాస్మా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు వైద్యులు. అయితే ప్లాస్మా థెరపీ అనుకున్నంత సమర్థంగా పనిచేయడం లేదని నిపుణులు గుర్తించారు. ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ మరణాల రేటు తగ్గించడం లేదని అధ్యయనంలో తేలింది. 39 ట్రయల్ సెంటర్లలో 464 కోవిడ్ పేషెంట్లలో ప్లాస్మాను ప్రవేశపెట్టి పరీక్షించగా.. అందులో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదని తేల్చారు నిపుణులు.

భారత్‌లో నిర్వహించిన అనేక పరిశోధనల ఆధారంగా.. కరోనా రోగుల చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రభావవంతంగా లేదని తేల్చిచెప్పారు వైద్యులు, శాస్త్రవేత్తలు. 18 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల బృందం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్లాస్మా థెరపీ సార్స్-కోవ్-2 వైరస్ జాతులను పెంచడానికి సహకరిస్తుందని ఆరోపించారు. దీంతో వైరస్‌ మరింత బలపడే చాన్స్‌ ఉందంటున్నారు. మరోవైపు ప్లాస్మా చికిత్స మార్గదర్శకాలు శాస్త్రీయంగా లేవని నిరూపిస్తున్న పలు అధ్యయనాలను నిపుణులు లేఖలో ప్రస్తావించారు.

ఇతర దేశాల్లోనూ ప్లాస్మా థెరపీ అంత ఫలితాన్ని చూపలేదని తేలింది. బ్రిటన్‌లో 11 వేల మందిపై నిర్వహించిన పరీక్షలో.. ప్లాస్మా థెరపీ ఎటువంటి ఫలితాన్ని చూపలేదని తేలింది. అర్జెంటీనాలోనూ.. సేమ్ ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయింది. అక్కడ కూడా వైద్యులు ప్లాస్మా చికిత్సను సమర్థవంతంగా పరిగణించలేదు.  ప్లాస్మా థెరపీపై నిపుణుల నివేదిక ఆధారంగా ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్లాస్మా థెరపీని నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రెండు రోజుల్లో ప్లాస్మా థెరపీపై కొత్త గైడ్‌ లైన్స్‌ విడుదల చేయనుంది.