ప్లాస్మా థెరపీ కరోనా రోగుల్లో మరణాలను అడ్డుకోలేదు, రక్తంలో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం, AIIMS

  • Published By: naveen ,Published On : August 7, 2020 / 10:35 AM IST
ప్లాస్మా థెరపీ కరోనా రోగుల్లో మరణాలను అడ్డుకోలేదు, రక్తంలో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం, AIIMS

కరోనా రోగుల్లో ఎన్నో ఆశలు రేపిన ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదా? ప్లాస్మా థెరపీ మరణాలను అడ్డుకోలేదా? అంటే అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని అందరూ భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్లాస్మా చికిత్స కరోనా రోగుల్లో మరణాల ప్రమాదాన్ని తగ్గించలేదని ఆయన స్పష్టం చేశారు.



ప్లాస్మాతో ప్రయోజనం లేదా?
కరోనాను జయించిన వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలను కరోనాతో బాధపడుతున్న రోగికి ఇవ్వడం ద్వారా, వారిలో రోగనిరోధక శక్తిని పుంజుకునేలా చేయడాన్నే ప్లాస్మా థెరపీగా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా చికిత్సా విధానం ఎంత సమర్థమైనదో తెలుసుకునేందుకు ఎయిమ్స్‌ డాక్టర్లు 30మంది కరోనా రోగులపై పరిశోధనలు నిర్వహించారు. దాని ప్రయోగాలను విశ్లేషించిన అనంతరం ఈ ఫలితం తేలినట్టు చెప్పారు.



ప్లాస్మా థెరపీ తీసుకున్నా చనిపోయారు:
రోగులను రెండు వర్గాలుగా విభజించారు. ఒకరికి కాన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీతో పాటు సాధారణ చికిత్సను అందించారు. మరో వర్గానికి ప్లాస్మా చికిత్స లేకుండా కేవలం సాధారణ చికిత్స మాత్రమే చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల్లోనూ మృతుల సంఖ్య సమానంగానే నమోదైందని డాక్టర్ గులేరియా వెల్లడించారు. అలాగే ప్లాస్మా థెరపీ తీసుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిలోనూ ఆశించినంత మెరుగుదల కనిపించలేదన్నారు. అయితే.. ఇది కేవలం మధ్యంతర విశ్లేషణ మాత్రమేనని, మరింత లోతైన అధ్యయనం తర్వాతే ప్లాస్మా థెరపీ వల్ల లాభనష్టాల గురించి స్పష్టంగా చెప్పగలమని ఆయన అభిప్రాయపడ్డారు.



ప్లాస్మా చికిత్సతో రక్తంలో ఇన్ఫెక్షన్లు:
బహుశా కరోనా రోగుల్లో ఒక రకమైన(సబ్‌ టైప్‌) రోగులకు మాత్రమే ప్లాస్మా థెరపీ ఉపకరిస్తుండవచ్చని ఎయిమ్స్‌ ప్రొఫెసర్ డా. మోనిష్‌ సొనేజా అంచనా వేశారు. ఆ రోగుల లక్షణాలు ఏమిటన్నది తెలుసుకుంటే థెరపీపై ఒక అభిప్రాయానికి రావచ్చన్నారు. ప్లాస్మా చికిత్స ద్వారా రక్తంలో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని ఎయిమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.నీరజ్‌ నిశ్చల్‌ హెచ్చరించారు.

ప్లాస్మా థెరపీపై మరింత లోతైన అధ్యయనం అవసరం:
ప్లాస్మా భద్రతను పరీక్షించాల్సిన అవసరం ఉందని.. COVID-19 రోగులకు ఎక్కించే ప్లాస్మాలో ఆ రోగికి ఉపయోగపడే స్థాయిలో యాంటీబాడీలు కూడా ఉండాలని డాక్టర్లు అంటున్నారు. “ప్లాస్మా సురక్షితం. దాని సమర్థత విషయానికొస్తే.. దానిపై ఇంకా సరైన స్పష్టత లేదు కనుక ప్లాస్మా థెరపీని ప్రయోగించే విషయంలో చట్టబద్ధత, జాతీయ మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది” అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి మెడిసిన్ విభాగంలో అదనపు ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోనిష్ సోనెజా అభిప్రాయపడ్డారు.



ప్లాస్మా మ్యాజిక్ బుల్లెట్ కాదు:
మొత్తంగా ప్లాస్మా థెరపీ ద్వారా పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోవడం లేదనే అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ మ్యాజిక్ బుల్లెట్ కాదంటున్నారు. కొందరు కరోనా రోగులు మాత్రమే లబ్ది పొందగలుగుతారని చెప్పారు. ప్లాస్మా థెరపీ అందరికి వర్కవుట్ అవుతుందని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.



ప్లాస్మా థెరపీ అంటే:
కొవిడ్‌-19 నుంచి పూర్తిగా కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయి. ఈ మహమ్మారి బారినపడ్డ ఇతర రోగులకు వీటితో చికిత్స చేయడమే ప్లాస్మా థెరపీ. యాంటీబాడీస్ కరోనా సోకిన రోగికి ఎక్కించడం ద్వారా వారి శరీరంలో కరోనావైరస్‌కి వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వారిని వ్యాధి నుంచి రక్షించవచ్చు. ఇప్పటికే చైనా, అమెరికాలో ఇలాంటి ప్రయోగాలను స్వల్ప స్థాయిలో నిర్వహించారు. అయితే ఇది పనిచేస్తుందన్న బలమైన ఆధారాలేమీ లేవు. అందువల్ల క్లినికల్‌ ప్రయోగాలను చేపడుతున్నారు.