మోడీ హెచ్చరించారు : ఇకపై అలా మాట్లాడను…నోబెల్ విజేత అభిజిత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2019 / 09:31 AM IST
మోడీ హెచ్చరించారు : ఇకపై అలా మాట్లాడను…నోబెల్ విజేత అభిజిత్

ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న కోల్ కతాకు చెందిన అభిజిత్ బెన‌ర్జీ ఇవాళ ఢిల్లీలో ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీని క‌లిశారు. ప్రధానితో సమావేశం అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లనని,ఎందుకంటే తనను ప్రధానమంత్రి హెచ్చరించారని అభిజిత్ తెలిపారు.

ప్రధానమంత్రితో సమావేశం ఎలా జరిగింది అని మీడియా ప్రశ్నించగా అభిజిత్ మాట్లాడుతూ…మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సోషల్ మీడియా నన్ను ఎలా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుందనే దానిపై జోక్ తో ప్రధాని ప్రారంభించారు. ఆయన టీవీ చూస్తున్నాడు. మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు. ఇండియా పట్ల తన ఆలోచనా విధానం గురించి ఆయన చెప్పాడు. భారతదేశం గురించి ఆయన ఆలోచించే విధానం గురించి మాట్లాడటానికి నాకు చాలా సమయం ఇచ్చారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పాలసీల గురించి ఒకరు వింటారు కానీ వాటి వెనుక ఉన్న ఆలోచన గురించి అరుదుగా వింటారు అని అభిజిత్ అన్నారు. ముఖ్యంగా పాలనను తను చూసే విధానం గురించి మోడీ మాట్లాడారని అభిజిత్ తెలిపారు. మరింత బాధ్యతాయుతంగా బ్యూరోక్రసీని మార్చేందుకు తను ఏ విధమైన సంస్కరణలు చేపడుతున్నది మోడీ చాలా అర్థవంతంగా వివరించాడని అభిజిత్ తెలిపారు.

అభిజిత్‌ను క‌ల‌వ‌డం అద్భుతంగా ఉంద‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. మాన‌వ సాధికార‌త కోసం క‌చ్చిత‌మైన ల‌క్ష్యాల‌తో అభిజిత్ ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. అభిజిత్ సాధించిన ఘ‌న‌త ప‌ట్ల దేశం గ‌ర్వంగా ఫీల‌వుతుంద‌ని అన్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేద‌రిక నిర్మూల‌న కోసం అభిజిత్ సూచించిన ప్ర‌ణాళిక‌ల‌ను నోబెల్ క‌మిటీ గుర్తించింది. అయితే బీజేపీ ప్ర‌భుత్వ విధానాన్ని అభిజిత్ త‌ప్పుప‌ట్టారు. దీంతో కొంద‌రు బీజేపీ నేత‌లు నోబెల్ విజేత‌పైన కూడా విమ‌ర్శ‌లు చేశారు. ఎటువంటి అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు మోదీని ఎన్నుకున్నార‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బెన‌ర్జీ తెలిపిన విషయం తెలిసిందే.