ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి, స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోడీ, ఏడోసారి ఎర్రకోటపై జాతీయజెండా ఆవిష్కరణ

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 08:23 AM IST
ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి, స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోడీ, ఏడోసారి ఎర్రకోటపై జాతీయజెండా ఆవిష్కరణ

ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం 150 మంది వీఐపీలు, 4వేల లోపే అతిథులు వేడుకలకు హాజరయ్యారు. ఎర్రకోటలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోడీ. అంతకుముందు రాజ్ ఘట్ లో మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ఇది ఏడోసారి. భద్రతా దళాలు, పోలీసులతో ఎర్రకోట చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు పెట్టారు.



కరోనా నేపథ్యంలో ఎర్రకోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రకోటను పూర్తిగా శానిటైజ్ చేశారు. థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు, శానిటైజ్ చేసి పంపిస్తున్న పోలీసులు. భౌతికదూరం పాటించేలా ఎర్రకోటలో 4వేల మంది కోసం ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి ఇచ్చారు.

జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన సంస్కరణలను దేశ ప్రజలకు వివరించారు. సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న జవాన్లు, భద్రతా బలగాలకు ప్రధాని మోడీ వందనం చేశారు. ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉందన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిసోందన్నారు. కరోనా కట్టడికి పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి జాతి తరఫున ప్రధాని మోడీ వందనం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. దేశం ముందు లక్షల సవాళ్లు ఉన్నాయని చెప్పారు. అయినా ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.



ఇప్పుడు మన కడుపు నింపుకోవడంతో పాటు పలు దేశాల ఆకలి తీరుస్తున్నామని గర్వంగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయని ప్రధాని చెప్పారు. సవాళ్లు మనలో సంకల్పాన్ని మరింత పెంచాయన్నారు. 74ఏళ్ల స్వతంత్ర్య భారతంలో అనేకం సాధించామన్నారు. 75ఏళ్లు పూర్తయ్యే సరికి మరో అడుగు ముందుకేస్తామన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రపంచానికి ఓ క్రాంతి లేఖ అని మోడీ అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న అనేక దేశాలకు భారత్ ప్రేరణగా నిలిచిందని చెప్పారు.

విస్తరణ వాదం, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి భారత్ కొత్త దారి చూపిందన్నారు. భారతీయ రక్షణ దళాలు, పోలీసులు నిరంతరం మనల్ని రక్షిస్తున్నారని చెప్పారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు, భద్రతా సిబ్బందికి ప్రధాని మోడీ వందనం చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా వదిలి మన పూర్వికులు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని ప్రధాని గుర్తు చేశారు.



ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి:
”స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతిబిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటోంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకువెళ్లాలి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్‌ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు.