బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రధాని మోడీ తప్పుపట్టారు. పార్లమెంటు ప్రాంగణంలో మాట్లాడిన ప్రధాని మోడీ, దేశానికి సంబంధించి ఈ దశాబ్దం చాలా కీలకమైందన్నారు. భారత స్వాతంత్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. దేశ చరిత్రలో గత ఏడాది తొలిసారిగా నిర్మలా సీతారామన్ నాలుగైదు మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు.

ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామనడం దురదృష్టకరం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విపక్షాలు దీనిపై పునరాలోచన చేయాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరూ బహిష్కరించలేదన్నారు. ప్రశ్నలను.. ప్రతిపక్షాలు కేంద్రం ముందుంచాలి కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించకూడదన్నారు. కాగా, నూతన సాగు చట్టాల రద్దు కోరుతూ 64 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని 18 రాజకీయ పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

నూతన సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, కరోనా వైరస్‌ విజృంభణ.. ఇలాంటి సమస్యల నడుమ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధమైంది. రెండు విడతలుగా (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడత)గా బడ్జెట్ సెషన్స్ సాగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రాలను రెడీ చేశాయి. విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శల అస్త్రాలను తిప్పికొట్టేందుకు మోడీ ప్రభుత్వం కూడా వ్యూహాలను రచించింది. శుక్రవారం(జనవరి 29,2021) ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు 2021-22 బడ్జెట్‌ను సమర్పిస్తారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతున్న విపక్షాలు తొలి రోజే తమ నిరసన అస్త్రాన్ని ప్రయోగించాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. అలాగే బాలాకోట్‌ మెరుపు దాడుల గురించి జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి లీక్‌ చేసిన విషయంపై జాయింట్ పార్లమెంటరీ  కమిటీతో విచారణ వంటి అంశాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.

కరోనా కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. సెప్టెంబర్ 24తో ముగిసిన వర్షాకాల సమావేశాల తర్వాత పార్లమెంటు తిరిగి ఇప్పుడు భేటీ అయ్యింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్థిక సర్వే.. కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉందనేది వెల్లడించనుంది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టే ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఈసారి రెండు రోజుల ముందే తీసుకొచ్చింది.

ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే 15వ ఆర్థిక సంఘం నివేదిక.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను నిర్దేశించనుంది. 2021-26 మధ్య ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే పన్నుల వాటా, గ్రాంట్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆర్థిక సంఘం నివేదిక స్పష్టం చేయనుంది. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా పంచాలని సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి దాన్ని దాదాపు యథాతథంగా కొనసాగించింది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కావడంతో ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఎలాంటి సిఫార్సులు చేసి ఉంటుందోనన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది.