Repair And Prepare : రిపేర్,ప్రిపేర్..ఇదే మన నినాదం

కరోనా వైరస్ ను ప్రస్తుత యుగపు అతిపెద్ద విధ్వంసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

Repair And Prepare : రిపేర్,ప్రిపేర్..ఇదే మన నినాదం

Pm Modi Calls For Repair And Prepare As India Emerges From Pandemic

Repair And Prepare కరోనా వైరస్ ను ప్రస్తుత యుగపు అతిపెద్ద విధ్వంసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. అన్ని దేశాలు కరోనా కారణంగా నష్టపోయాయని, భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిగా అనేక రంగాలు ప్రభావితమైనట్లు తెలిపారు. అయితే ఇటువంటి ఆటంకాలు, విచ్ఛిత్తి ప్రక్రియలతో నిరాశానిస్పృహలకు గురికావల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడిప్పుడే కొవిడ్ నుంచి కోలుకుంటున్న ఆశారేఖలు దేశవ్యాప్తంగా విస్తరించుకుంటున్నాయని… ఈ దశలో మనను మనం మునుపటి స్థితికి వెళ్లేందుకు సిద్ధం చేసుకోవల్సి ఉందన్నారు

సెకండ్ వేవ్ నుంచి దేశం క్రమంగా బయటపడుతున్న వేళ కుదేలైన రంగాలన్నీ తిగిరి పుంజుకునేందుకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆర్థికంగా, ఉద్యోగ ఉపాధిపరంగా పుంజుకునేందుకు సమాయత్తం కావల్సి ఉందన్నారు. దీని కోసం రిపేర్​, ప్రిపేర్​ అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కాల్సి ఉంది. దశాబ్దాలలో ఎప్పుడూ లేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయిలో కుంచించుకుపోయిందన్నారు.

ఫ్రాన్స్​ నిర్వహించిన ఐదో వివాటెక్​ సదస్సులో బుధవారం వర్చువల్​గా పాల్గొన్న ప్రధాని.. విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిభ, మార్కెట్, మూలధనం, పెట్టుబడుల వాతావరణం, సాంస్కృతిక స్వేచ్ఛ అనే ఐదు స్తంభాల ఆధారంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచాన్ని ఆహ్వానిస్తునట్లు తెలిపారు.టెక్నాలజీ, స్టార్టప్‌ల రంగంలో ప్రపంచస్థాయిలో భారతదేశపు విజయాల గురించి విదితమైన వాస్తవాలు అందరికి తెలిసినవే అన్నారు. భారతీయ సాంకేతిక సమూహం ప్రపంచంలోనే ప్రముఖమైనదని.. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కీలక సమస్యలకు భారతీయ యువత సాంకేతిక పరిష్కారం చూపారని ప్రధాని తెలిపారు.

ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉన్న దేశంగా కూడా భారత్ నిలిచిందని మోదీ తెలిపారు. ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులకు ఏది అవసరమో అదే భారత్ అందజేస్తోందని ప్రధాని అన్నారు. కరోనా కాలంలోనూ మైనింగ్, అంతరిక్షం, బ్యాంకింగ్‌, అణు ఇంధనం వంటి రంగాల్లో భారత్‌ భారీ సంస్కరణలు అమలు చేసిందని మోదీ గుర్తుచేశారు.