హగ్ చేసుకుని, భుజం తట్టి : కంటతడి పెట్టిన ఇస్రో చీఫ్ ని ఓదార్చిన ప్రధాని

హగ్ చేసుకుని, భుజం తట్టి : కంటతడి పెట్టిన ఇస్రో చీఫ్ ని ఓదార్చిన ప్రధాని

ఆఖరి నిమిషంలో సాంకేతిక కారణాలతో చంద్రయాన్-2 ప్రయోగం అనుకున్నది సాధించలేకపోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ బాగా హర్ట్ అయ్యారు. చిన్నపిల్లాడిలా ఆయన ఏడ్చేశారు. ఇది గమనించిన ప్రధాని మోడీ.. శివన్ ని దగ్గరికి తీసుకున్నారు. ఆయనను హగ్ చేసుకున్నారు. చాలాసేపు వీపు నిమిరారు. శివన్ ని ఓదార్చారు. ఆయనకు ధైర్యం చెప్పారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. శివన్ ని ప్రధాని మోడీ ఓదారుస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

బెంగళూరులోని ఇస్రో సెంటర్ లో శాస్త్రవేత్తలతో ప్రధాని మోడీ మాట్లాడారు. మరోసారి ప్రయత్నం చేద్దామని వారికి భరోసా ఇచ్చారు. శాస్త్రవేత్తలతో మాట్లాడిన తర్వాత ప్రధాని తిరుగుపయనం అవుతుండగా..  భావోద్వేగానికి గురైన ఇస్రో చీఫ్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆయనను వెంటనే హత్తుకుని ప్రధాని మోడీ ఓదార్చారు. వీపుపై నిమిరారు, తట్టారు. శివన్ కు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏడ్వొద్దు  మనం మళ్లీ ప్రయత్నం చేద్దాం అని ప్రోత్సహించారు ప్రధాని మోడీ.

చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంతా అనుకున్నట్టే జరిగింది. చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు వరక అంతా కన్ను ఆర్పకుండా మహత్తర ఘట్టం కోసం చూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవడం నిరాశ కలిగించింది. చంద్రయాన్-2 అనుకున్నది సాధించలేకపోయామనే బాధ కలిగింది.

కాగా, చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోడీ. శాస్త్రవేత్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్న ఆయన… మరింత కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వెయ్యాలన్నారు. ఇలాంటి అడ్డంకులు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయన్న ఆయన.. వాటికి ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాలన్నారు. బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ సెంటర్ నుంచి ప్రసంగించిన ప్రధాని మోడీ… ఈ ప్రయోగం కోసం నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతీ శాస్త్రవేత్తనూ అభినందించారు. శాస్త్రవేత్తల ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఆయన… వారి శ్రమను దేశ ప్రజలు అర్థం చేసుకోగలరని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా చంద్రయాన్ గురించి రాస్తే… ఫెయిలైందని రాయరన్న మోడీ… చివరి క్షణం వరకూ చందమామను చేరుకోవడానికి ప్రయత్నించారనే రాస్తారని అన్నారు.

అంతరిక్ష ప్రయోగాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయన్న మోడీ… వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మరిన్ని లక్ష్యాల్ని సాధించాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు సంతోషించే మరిన్ని విజయాలు భవిష్యత్తులో వస్తాయన్న మోడీ… నెక్ట్స్ టైమ్ మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని చూసి దేశం గర్విస్తోందన్న మోడీ… ఇప్పటివరకూ జరిగిన జర్నీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రమండల యాత్ర కొనసాగుతుందన్న ఆయన.. మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తామన్నారు. ఇప్పటివరకూ ఇస్రో సాధించిన విజయాల్ని గుర్తుచేసిన మోడీ… మరిన్ని ప్రయోగాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. తాను, దేశం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తల నిరాశను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. ఇది ఓటమి కానే కాదన్నారు.