సోనియా గాంధీ,మాజీ ప్రధానులకు ఫోన్ చేసిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 01:59 PM IST
సోనియా గాంధీ,మాజీ ప్రధానులకు ఫోన్ చేసిన మోడీ

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, HD దేవేగౌడలకు మోడీ ఫోన్‌ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్,అఖిలేష్ యాదవ్,తెలంగాణ సీఎం కేసీఆర్,బెంగాల్ సీఎం మమతా,ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్,డీఎంకే నాయకుడు స్టాలిన్ లకు కూడా మోడీ ఫోన్ చేశారు.

కరోనా కట్టడికి సంబంధించిన అంశాలను వారితో ప్రధాని చర్చించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. అలాగే కరోనా నియంత్రణ కోసం వారి నుంచి సూచనలు, సలహాలను కోరినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగుస్తుండటంతో.. ఆ తర్వాత ఏం చేద్దామనే దానిపై మోదీ అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

కరోనా కట్టడిలో భాగంగా మోడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేటప్పుడు ఆయన ప్రతిపక్షాల నుంచి గానీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి గానీ ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండా.. ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఫోన్ చేసి కరోనా నివారణ చర్యలపై వారితో మోడీ చర్చించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు కరోనా ఇష్యూపై  పార్లమెంట్‌లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు.