Punjab Election : 15 నిమిషాలకే మోదీకి ఇబ్బంది..రైతులకు ఏడాది కష్టం!

బుధవారం ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన స్టైల్ లో స్పందించారు.

Punjab Election : 15 నిమిషాలకే మోదీకి ఇబ్బంది..రైతులకు ఏడాది కష్టం!

Sidhu

Navjot Sidhu :  బుధవారం ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన స్టైల్ లో స్పందించారు. గురువారం బర్నాలాలోని దనా మండీలో ఓ కార్యక్రమంలో సిద్ధూ మాట్లాడుతూ…”ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా రైతులు ఆందోళన చేశారని,కానీ నిన్న ప్రధాని 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 15 నిమిషాల ఆలస్యం వల్ల మోదీకి ఇబ్బంది కలిగింది. ఎందుకు ఈ ద్వంద వైఖరి? మోదీ గారు..రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మీరు చెప్పారు కానీ మీరు వాళ్ల దగ్గర ఉన్నది కూడా లాక్కున్నారు” అని అన్నారు.

ఇవాళ సాయంత్రం సిద్ధూ ఓ ట్వీట్ లో..”రైతులకు కావలసింది ‘ఇజ్జత్ ది రోటీ’, న్యాయబద్ధమైన ఆదాయ పెరుగుదల. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని వాగ్దానం చేశారు. నిజం ఏమిటంటే… డీజిల్, ఫార్మ్ ఇన్‌పుట్‌లు, పప్పు, ఎడిబుల్ ఆయిల్ ధరలు రెట్టింపు అయ్యాయి, నిరుద్యోగం 3 రెట్లు పెరిగింది. రైతులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు”అని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య ఫిరోజ్​పుర్​లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్​లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడం వల్ల.. ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ఢిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే, సభకు జనం రాలేదనే మోదీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

మరోవైపు,ప్రజల సానుభూతి కోసం మోదీ చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. ప్రాణాలతో బయటపడ్డానంటూ మోదీ వ్యాఖ్యానించారని, దీన్ని బట్టి ఇదంతా ఓ డ్రామా అని అర్థమవుతోందన్నారు. సానుభూతి కోసం చేస్తున్న చౌకబారు ప్రయత్నం ఇది అని రాకేశ్ టికాయిత్ ఎద్దేవా చేశారు. మోదీ పర్యటనలో భద్రతా లోపాలు ఏమైనా ఉంటే.. దర్యాప్తు జరపాలని టికాయిత్ డిమాండ్ చేశారు. బీజేపీ వర్గాలేమో భద్రతా లోపాలు అని చెబుతున్నాయని, సభకు జనం రాలేదని..అందుకే ప్రధాని పంజాబ్ పర్యటనకు రద్దు చేసుకొని ఢిల్లీకి తిరిగెళ్లిపోయారని ముఖ్యమంత్రి చన్నీ చెబుతున్నారు. మరి భద్రతా లోపాల వల్ల సభ ఆగిపోయిందా లేదా అన్నదాతల ఆగ్రహం వల్ల ఆగిపోయిందా అనే విషయంపై దర్యాప్తు జరపాలి’ అని టికాయిత్ ఓ ట్వీట్ లో తెలిపారు.

ఇక,మరికొన్ని వారాల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

ALSO READ Hypersonic Missile : తగ్గేదే లే అంటున్న కిమ్..హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం