PM Modi On Budget 2022: ఇది పేదల బడ్జెట్.. అభివృద్ధిపై నమ్మకాన్ని తెచ్చింది -ప్రధాని మోదీ

సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

PM Modi On Budget 2022: ఇది పేదల బడ్జెట్.. అభివృద్ధిపై నమ్మకాన్ని తెచ్చింది -ప్రధాని మోదీ

Modi

PM Modi On Budget 2022: సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వందేళ్ల భయంకరమైన విపత్తుల మధ్య ఈ బడ్జెట్‌ అభివృద్ధిపై నమ్మకాన్ని తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు మోదీ. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలతో ఈ బడ్జెట్ నిండుగా ఉందని అన్నారు మోదీ.

దేశంలోనే తొలిసారిగా హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు పర్వతమాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ ప్రణాళికతో పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. ఈ బడ్జెట్ మరిన్ని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అభివృద్ధి వంటి కొత్త అవకాశాలతో సంపూర్ణంగా ఉందని అన్నారు.

ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమమే ముఖ్యమని, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, కుళాయి నీళ్లు, టాయిలెట్, గ్యాస్ సౌకర్యం, వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆధునిక ఇంటర్నెట్ కనెక్టివిటీకి సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

భారత ప్రజల విశ్వాసం, గంగామాత పరిశుభ్రతతో పాటు రైతుల సంక్షేమం కోసం ప్రణాళికలు వేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల్లో గంగా తీరం వెంబడి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు.

అదేవిధంగా ఈ బడ్జెట్‌లో రక్షణ మూలధనం నుంచి 68శాతం దేశీయ పరిశ్రమకు కేటాయించడం వల్ల భారతదేశంలో MSME రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీపుల్ ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు. ఈ బడ్జెట్ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తుందని అన్నారు.