కీలక మంత్రులతో మోడీ సమావేశం

కీలక మంత్రులతో మోడీ సమావేశం

PM Modi నూతన సాగు వ్యవసాయ చట్టాలపై అటు రాజ్యసభలో..ఇటు లోక్ సభలోనూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలు దాడి చేస్తుండటంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ(ఫిబ్రవరి-5,2021) ప్రధాని నరేంద్ర మోడీ కీలక మంత్రులతో పార్లమెంట్‌లో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పీయూశ్ గోయల్ ఈ భేటీకి హాజరయ్యారు.

పార్లమెంట్‌లో ఏర్పడ్డ ప్రతిష్టంభనను ఎలా తొలగించాలన్న ప్రధాన అజెండాగానే ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రపతి ప్రసంగ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపుతూ ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం కూడా ఎలాంటి అవరోధాలూ లేకుండా ఎలా సాగాలన్న విషయంపై కూడా మోడీ మంత్రులతో చర్చించినట్లు సమాచారం.

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సభాముఖంగా మోడీ సమాధానం చెప్పే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే.. అందరి దృష్టి ప్రధాని ప్రసంగంపైనే ఉంటుంది.