జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రారంభం, మూడు కోట్ల మంది ఖర్చు కేంద్రానిదే – మోడీ

జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రారంభం, మూడు కోట్ల మంది ఖర్చు కేంద్రానిదే – మోడీ

PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. మూడు కోట్ల మంది హెల్త్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకాల‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు. సంక్షోభ సమయంలో..అందరూ ఒక్కటై పని చేశారని, మిగతా దేశాలకల్లా భారత్ లో కరోనా వ్యాపించలేదని చెప్పుకొచ్చారు. 2021, జనవరి 11వ తేదీ సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ..వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, తదితర విషయాలపై గురించి మాట్లాడారు. రానున్న కొన్ని నెల‌ల్లో 30 కోట్ల మందికి టీకా వేయ‌నున్న‌ట్లు, అతిపెద్ద వ్యాక్సినేషన్ దేశంలో ప్రారంభమౌతోందని, ఇప్పటికే అన్ని దేశంలోని అన్ని జిల్లాల్లో డ్రై రన్ పూర్తయిందని తెలిపారు. ఇది ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు. అత్యవర స్థితిలో ఉపయోగించడానికి రెండు మేడు ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని ప్రధాని మోడీ వెల్లడించారు. సీరం సంస్థ వ‌ద్ద కోటి ప‌ది ల‌క్ష‌ల టీకాల‌కు కేంద్రం డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఆ సంస్థకు ఆర్డ‌ర్ చేసింది. కోవీషీల్డ్‌, కోవాగ్జిన్ టీకాల‌ను భార‌త్ వినియోగించ‌నున్న విష‌యం తెలిసిందే.