తమిళ్ నేర్చుకోలేకపోయినందుకు భాధపడుతున్నా : మోడీ

తమిళ్ నేర్చుకోలేకపోయినందుకు భాధపడుతున్నా : మోడీ

PM Modi మరికొద్ది రోజుల్లో( ఏప్రిల్ 6న) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ తమిళ బాషపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాషను నేర్చుకోలేకపోయానని బాధగా ఉందని పశ్చాత్తాపం తెలియజేశారు. ఆదివారం నిర్వహించిన “మన్ కీ బాత్”లో మాట్లాడిన ప్రధాని..తమిళం ఎంతో అందమైన భాష అన్నారు. ఇన్నేళ్లు సీఎంగా, ప్రధానిగా పనిచేసిన సమయంలో ఏదైనా మిస్ అయ్యానని ఫీలవుతున్నారా? అని అపర్ణా రెడ్డి అనే శ్రోత అడిగిన ప్రశ్నకు ఈ సందర్భంగా మోడీ జవాబిచ్చారు.

ఈ ప్రశ్న గురించి చాలా ఆలోచించా. తమిళ భాష గొప్పతనం, తమిళ సాహిత్య విశిష్టత గురించి నాకు ఎంతోమంది చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన తమిళ భాషను నేర్చుకోనందుకు చాలా బాధగా ఉంది అని మోడీ అన్నారు. తమిళ్ ఎంతో అందమైన భాష అని,ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ భాష అని అన్నారు. ఇటువంటి అనేక భాషలకు బారత్ నిలయం అని..అవి సంప్రదాయానికి సింబల్ మరియు గర్వకారణమని మోడీ అన్నారు.

కాగా, గతంలోనూ తమిళ భాష గురించి ప్రధాన మోడీ ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలోనూ పలుసార్లు తమిళ సూక్తులను మోడీ ఉపయోగించారు. 2019లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా సుప్రసిద్ధ తమిళ కవి ‘కణియన్ పూంగుండ్రనార్’ మాటలను ఉటంకిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘యాదుమ్ ఒరే యావారుమ్ కెళిర్’ అన్న కవి వ్యాఖ్యలతో ప్రపంచానికి భారత ఆదర్శాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. ‘మనం అందరికీ.. అన్ని ప్రాంతాలకు చెందినవాళ్లం’ అనేది దీని అర్థం. మూడువేల ఏళ్ల క్రితం జీవించిన ఆ మహాకవిని తన ప్రసంగం ద్వారా మరోసారి యావత్ ప్రపంచానికి మోడీ గుర్తు చేశారు. మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ జీవిస్తున్నా మనం పుట్టిన భూమిని అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు

ఇక,2019లో దేశవ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన సమయంలో ఆ మంటలు చల్లార్చడానికి తమిళ భాషపై మోడీ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాషగా తమిళానికి గుర్తింపు ఉందని, అమెరికాలో ఆ భాషను గౌరవించే వారి సంఖ్య వేలల్లో ఉందని చెప్పారు. తన అమెరికా పర్యటనన సందర్భంగా హ్యూస్టన్ లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఎనిమిది భాషల్లో తాను మాట్లాడానని, తాను తమిళంలో మాట్లాడిన సమయంలో వేలాది మంది తనను అదే భాషలో పలకరించారని మోడీ చెప్పుకొచ్చారు. హౌడీ మోడీ కార్యక్రమంలో మిగిలిన అన్ని భాషల కంటే తమిళం ఎక్కువగా వినిపించిందని, సభలో మారుమోగిపోయిందని ప్రధాని అన్నారు. తమిళ భాషకు చాలా చారిత్రాత్మక, ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.