భారత్-బంగ్లాదేశ్ మధ్య రైల్వే లైన్ ప్రారంభించిన మోడీ,షేక్ హసీనా

భారత్-బంగ్లాదేశ్ మధ్య రైల్వే లైన్ ప్రారంభించిన మోడీ,షేక్ హసీనా

India, Bangladesh restore pre-1965 rail link బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కరోనా నేపథ్యంలో చర్చలు వర్చువల్ గా జరిగాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…”పొరుగు దేశాలే ప్రథమం” అన్న భారత విధానంలో బంగ్లాదేశ్ కు పెద్ద పీట వేశామన్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే.. బంగ్లాదేశ్​తో బంధం బలపరచుకునే అంశానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చానని మోడీ తెలిపారు.

భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్‌కు ప్రాధాన్యమిస్తుందని, బంగ్లాదేశ్‌తో సంబంధాల‌ను బ‌ల‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ప్రాధాన్య‌తగా నిలిచిన‌ట్లు మోడీ చెప్పారు. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య వర్చువల్ గా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని, అయితే విజయ దివస్ తర్వాత జరుగుతున్న ఈ వర్చువల్ సమావేశానికి అధిక ప్రాధాన్యం ఉందని మోడీ తెలిపారు. విజయ దివస్ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆ టార్చ్ ను దేశమంతా తీసుకెళ్తామన్నారు.

కరోనా మ‌హ‌మ్మారి కారణంగా అంద‌రికీ స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ని, ఇలాంటి స‌మ‌యంలో బంగ్లాదేశ్ తో మంచి స‌హ‌కారం అందింద‌ని, హెల్త్ ప్రొఫెష‌న‌ల్స్‌, కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇరు దేశాలు క‌లిసి ప‌నిచేసిన‌ట్లు మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధాలు బలంగా ఉండాలని ఇరు పక్షాలు కోరుకుంటున్నాయని, భారత్ ఎప్పుడూ బంగ్లా ప్రజలను గౌరవిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

కోవిడ్‌19ను భార‌త్‌ ఎదుర్కొన్న తీరు ప‌ట్ల బంగ్లాదేశ్ ప్ర‌ధాని హ‌సీనా ప్ర‌శంస‌లు కురిపించారు. కరోనా సమయంలోనూ ఇరు దేశాలు కలిసే పనిచేశాయని,పరస్పర సంబంధాలు కూడా బలపడ్డాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని షేక్ హసీనా అన్నారు. 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన బంగ్లాదేశ్ ప్ర‌ధాని… వీర మరణం పొందిన భారత జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం మ‌న‌సుపూర్తిగా స‌హ‌క‌రించిన భార‌త ప్ర‌జ‌ల‌కు కృతజ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు హ‌సీనా తెలిపారు. యుద్ధ సమయంలో తన కుటుంబం ఎంత కష్టపడిందో ఈ సందర్భంగా ఆమె వివరించారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 1965కి ముందున ఉన్న చిల్హాటీ – హల్దీబారీ రైల్వే లింక్‌ను ఇరుదేశాధినేతలు పున ప్రారంభించారు. 55 ఏళ్ల తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ ట్రాన్స్-బోర్డర్ లైన్ ని పునరుద్దరించారు. దీంతో ఇకపై ఇరుదేశాలమధ్య త్వరలో ఈ లైన్ గుండా ప్రయాణికుల రైళ్ల రాకపోకలు జరుగనున్నాయి. ఈ మార్గంలో మొదట గూడ్స్ రవాణా జరుగుతుందని,ఇరు వైపులా అవసరమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమైన తర్వాత ప్యాసింజర్ మూమెంట్ ఉంటుందని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ మరియు భారత్ లోని అస్సాం,వెస్ట్ బెంగాల్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు చిల్హాటీ-హల్దీబారీ రైల్ లింక్ ఉపయోగపడనుంది.

దీనితో పాటు ఈ వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కూడా కుదిరాయి.ఈ సమ్మిట్ సందర్భంగా హైడ్రోకార్బన్స్,అగ్రికల్చర్,టెక్స్ టైల్స్,కమ్యూనిటీడెవలప్ మెంట్ రంగాల్లో సహకారంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భారత్​-బంగ్లాదేశ్​ మధ్య వేగంగా పెరుగుతున్న బంధానికి ఈ ఒప్పందాలు ప్రతిబింబంగా నిలిచాయి.

అనంతరం బంగ్లాదేశ్​ వ్యవస్థాపకులు ముజీబుర్​ రెహ్మాన్​, భారత జాతిపిత మహాత్మా గాంధీ జీవితాల ఆధారంగా రూపొందించిన డిజిటల్​ ఎగ్జిబిషన్​ను మోదీ-హసీనా ఆవిష్కరించారు. ఆ ఎగ్జిబిష‌న్లు యువ‌త‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని తెలిపారు. ముజిబుర్​ స్మారక స్టాంప్​ను కూడా ఇరువురు ఆవిష్కరించారు