టీకా వేశారా..అబ్బే తెలియనే లేదు – మోడీ

టీకా వేశారా..అబ్బే తెలియనే లేదు – మోడీ

PM Modi : తనకు టీకా వేశారా ? వేసినట్లే తెలియలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2021, మార్చి 01వ తేదీ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు చేరుకున్న ఆయన..కరోనా (కోవాగ్జిన్) తొలి టీకా తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన పీ నివేద, కేరళ రాష్ట్రానికి చెందిన రోశమ్మలు ఆయనకు టీకా వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

టీకా తీసుకున్న తరువాత మోడీ తనకు టీకా వేసినట్టే తెలియలేదని అన్నారని నివేద వెల్లడించారు. ప్రధాని మోడీకి టీకా వేయడంతో దేశ వ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. టీకా తీసుకున్న తర్వాత..అక్కడనే కొద్దిసేపు కూర్చొన్నారు. వ్యాక్సినేషన్ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. టీకా వేయించుకొనే సమయంలో ప్రధాని వెంట ఒకరిద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, దేశం యావత్తు కరోనాను ఎదుర్కోవాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ప్రధాని మెడలో అస్సామీ సంస్కృతికి చెందిన కండువా వేసుకున్నారు. నిజానికి మోడీ వ్యాక్సినేషన్ వేయించుకొనే షెడ్యూల్ చేయలేదు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోవాలని నిర్ణయం తీసుకున్న అనంతరం గంట ముందు…ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు ఎయిమ్స్ యాజమాన్యానికి తెలియచేసినట్లు తెలుస్తోంది. రెండవ డోసు 28 రోజుల తరువాత ఇవ్వాల్సివుంది.