PM Modi to CMs: ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం.. ఆంక్షలు పెరుగుతాయా? లాక్‌డౌన్ ఉంటుందా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.

PM Modi to CMs: ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం.. ఆంక్షలు పెరుగుతాయా? లాక్‌డౌన్ ఉంటుందా?

Modi

PM Modi to CMs: కోవిడ్ -19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విపరీతంగా పెరిగిపోతుంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటల 30నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.

కొద్ది రోజులుగా లక్షపైనే కేసులు నమోదు అవుతుండగా.. కొత్త కేసుల సంఖ్య లేటెస్ట్‌గా రెండు లక్షలకు చేరుకుంది. ప్రతీరోజూ 400మందికి పైగా కరోనాతో చనిపోతున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండడంతో వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వైద్య సన్నద్ధత, టీకా కార్యక్రమం అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్ విధింపు వంటి అంశాలపై సమీక్షలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తుండగా.. ఇప్పటికే మకర సంక్రాంతి రోజు హరిద్వార్‌, రిషికేశ్‌లోని గంగానది ఘాట్‌ల వద్ద పవిత్ర స్నానాలను నిషేధించింది.

ఒడిశా సర్కారు కూడా మకర సంక్రాంతి సహా వరుసగా మూడు రోజులపాటు సముద్ర, నదీ తీరాల వద్ద పుణ్య స్నానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లపై నిషేధం విధించగా.. ప్రైవేటు కార్యాలయాలనూ పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది.

అటు థర్డ్‌ వేవ్‌కు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమని నిపుణులు చెబుతుండగా.. దేశంలో ఉద్ధృతి ఈ నెలలోనే గరిష్ఠానికి చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో థర్డ్‌ వేవ్‌ అతిత్వరలో తగ్గుముఖం పట్టనుందని.. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందాల్సిన అవసరమూ అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ ముంబై, ఢిల్లీ నగరాల్లో సెకండ్ వేవ్ నాటి కల్లోలం కనిపించడం లేదు. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడడంతో వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండటంతో ముంబై, ఢిల్లీ నగరాలు విపత్తు బారిన పడకుండా కోలుకుంటున్నాయి.