మోడీ దీపాల విజ్ణప్తి వెనుక బీజీపీ రహస్య ఎజెండా

10TV Telugu News

కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మోడీ ఇచ్చిన పిలుపుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. 

మోడీ పిలుపు వెనుక బీజేడీ హెడెన్ ఎజెండా(దాగి ఉన్న రహస్యం)ఉందని కుమారస్వామి అన్నారు. ఈ దీపాలు వెలిగిస్తే ఏం జరుగుతుందో శాస్త్రీయ, హేతుబద్ధమైన వివరణ ఇవ్వాలని తాను మోడీని ఛాలెంజ్ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. మోడీ జిత్తులమారి ఆలోచనతో బీజేపీ ఫౌండేషన్ డే రోజున దేశ ప్రజలందరూ దీపాలు వెలిగించాలని ఈ పిలుపునిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినం అని, దీపాలు వెలిగించడానికి ఎంచుకున్న తేదీ, సమయంపై ఏం వివరణ ఇస్తారని కుమారస్వామి నిలదీశారు. 

దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక విపత్తును తమ ఉన్నతిని చాటుకునేందుకు వేదికగా మార్చుకోవాలని భావించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రపంచవ్యాప్త విపత్తును తమ పార్టీ రహస్య ఎజెండాను అమలుచేసేందుకు వాడుకోవడం సిగ్గుచేటని కుమారస్వామి అన్నారు. వైద్యులకు పీపీఈ కిట్లను, సామాన్యులకు అందుబాటులో ఉండేలా కరోనా టెస్ట్ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు వివరించకుండా, అర్థం లేని పనులకు ప్రధాని పిలుపునిస్తున్నారని కుమారస్వామి విమర్శించారు.