Cabinet Rejig Meeting : కేబినెట్ విస్తరణపై కీలక నేతలతో మోదీ భేటీ రద్దు!

ఈ నెల 8న కేంద్ర కేబినెట్‌ విస్తరణ ఉండబోతుందటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు ఢిల్లీలోని ప్ర‌ధానమంత్రి నివాసంలో కీలక మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడితో జరగాల్సిన స‌మావేశం ర‌ద్ద‌య్యింది.

Cabinet Rejig Meeting : కేబినెట్ విస్తరణపై కీలక నేతలతో మోదీ భేటీ రద్దు!

Pm Modi

Cabinet Rejig Meeting ఈ నెల 8న కేంద్ర కేబినెట్‌ విస్తరణ ఉండబోతుందటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు ఢిల్లీలోని ప్ర‌ధానమంత్రి నివాసంలో కీలక మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడితో జరగాల్సిన స‌మావేశం ర‌ద్ద‌య్యింది.

కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రుల పనితీరు, భవిష్యత్‌ పథకాలపైనే ప్రధానంగా చర్చ జరగుతుందని భావించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, ప్రహ్లాద్‌ జోషీ, పీయూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో పాటు భాజపా జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ మోదీ నివాసంలో మంగళవారం జరిగే భేటీలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఈ భేటీ రద్దయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

మరోవైపు,కేబినెట్ విస్త‌ర‌ణ‌ విషయమై గత శనివారం,ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో ప్రధాని మోదీ రహస్య చ‌ర్చ‌లు జ‌రిపినట్లు సమాచారం. ప్రధాని మోదీ నివాసంలో ఆదివారం మీటింగ్ సుమారు ఆరు గంటల పాటు జరిగినట్లు తెలుస్తోంది. శనివారం మీటింగ్ కూడా ఐదారు గంటల పాటు జరిగినట్లు సమాచారం. విస్తరణ జాబితాకు తుది మెరుగులద్దడానికే వీరు సమావేశమైనట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,ఉత్తరాఖండ్,పంజాబ్ తోపాటు బీహార్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, 2019లో నరేంద్ర మోదీ మోదీ రెండోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. నిబంధనల ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా, కొన్ని శాఖలకు సహాయమంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్‌ సోనోవాల్‌, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ, ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేసిన పశుపతి పరాస్‌ తదితరులకు కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందనే ప్రచారం బలంగా ఉంది. ఇప్పటికే పలువురు ఆశావహులు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.