జవాన్లతో కలిసి మోడీ దీపావళి…పాక్,చైనాకు హెచ్చరిక

10TV Telugu News

PM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని​ జైసల్మేర్​ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్‌లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ…ప్రతి భారతీయుడి దీపావళి శుభాకాంక్షలను నేను తీసుకొచ్చాను. జవాన్లు మంచు పర్వతాల్లో ఉన్నా.. ఎడారుల్లో ఉన్నా మిమ్మల్ని కలిస్తేనే నా దీపావళి పరిపూర్ణమవుతుంది… మీ ముఖంపై చిరునవ్వులు చూస్తే నా ఆనందం రెట్టింపవుతుంది… భారత జవాన్ల శౌర్యపరాక్రమాలు అసమానమని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో ప్రపంచంలోని ఏ శక్తి మన సైనికులను అడ్డుకోలేదంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్‌లను హెచ్చరించారు. త్రివిధ దళాలు పరస్పరం సహకరించుకుంటూ శత్రుమూకలపై విజయం సాధిస్తున్నాయని ప్రశంసించారు. ఇందుకు 1971లో పాక్‌తో జరిగిన యుద్ధమే ఉత్తమ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు.సైనికులు సంతోషంగా ఉంటేనే దేశమైనా, పండగైనా. దేశాన్ని ధైర్యంగా రక్షించే సైనికుల పట్ల భారతదేశం గర్విస్తోంది. ఆక్రమణదారులు, చొరబాటుదారులను ఎదుర్కొనే ధైర్యం మన సైనికులకు ఉంది. సైనికుల బలం, ధైర్యం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా… పాక్​, చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపారు మోడీ. సరిహద్దుల్లో భారత్​ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని స్పష్టం చేశారు. భారతదేశానికి అనేక దేశాలతో సుదీర్ఘ సరిహద్దులు ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తెలిసిన సరిహద్దు ఒకటుంది.. అదే లాంగేవాలా పోస్టు. పాక్‌ సైనికుల నుంచి లాంగేవాలా సరిహద్దును కాపాడుకున్నాం. భారత్​ తన వ్యూహాలపై స్పష్టంగా ఉంది. ఇతరులను గౌరవిస్తూ, గౌరవంగా ఉండటమే భారత్​ విధివిధానం. అయితే ఎవరైనా మన సహనాన్ని పరీక్షించాలని చూస్తే వారికి గట్టి జవాబిస్తాం అని మోడీ అన్నారుఈ రోజు యావత్‌ ప్రపంచం విస్తరణవాద శక్తులతో సమస్య ఎదుర్కొంటోందని మోడీ తెలిపారు. విస్తరణవాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం స్పష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలు, విధానాలను భారత్‌ గౌరవిస్తుంది. అయితే మనల్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు భారత్‌ శత్రుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను, వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్‌ ఎన్నడూ రాజీపడదు. ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైంది” అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ఇంతటి గౌరవాన్ని పొందిందంటే అదంతా సైనికుల పరాక్రమాల వల్లే అని ప్రధాని కొనియాడారు.భారత్​ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోందని మోడీ తెలిపారు. రక్షణ రంగాన్ని ‘ఆత్మనిర్భర్​’గా చేయడానికి కృషి జరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో సొంతంగా ఆయుధాల కర్మాగారం నెలకొల్పడంపైనా దృష్టి పెట్టినట్లు తెలిపారు.