నడ్డాతో స్కూటర్ పై తిరిగేవాడిని…అమిత్ షా గురించి పదాల్లో చెప్పలేను

  • Published By: venkaiahnaidu ,Published On : January 20, 2020 / 01:01 PM IST
నడ్డాతో స్కూటర్ పై తిరిగేవాడిని…అమిత్ షా గురించి పదాల్లో చెప్పలేను

బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతారని ప్రశంసించారు. ఆయన సామర్థ్యాలకు తగినట్లుగానే బాధ్యతలను భుజాన వేసుకుంటారని, ఆయన చాలా బాగా పనిచేయడం తాను చూశానని మోడీ అన్నారు.

నడ్డా అంకితభావంతో మరియు క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్త అని, పార్టీని అట్టడుగు నుంచి బలోపేతం చేయడానికి సంవత్సరాలుగా పనిచేస్తున్నారని మోడీ అన్నారు. నడ్డా తనకు పాత స్నేహితుడని, తాను పార్టీ బాధ్యతలు చూసే సమయంలో నడ్డా యువమోర్చా బాధ్యతలు చూసేవారని మోడీ అన్నారు. తామిద్దరమూ కలిసి స్కూటర్‌పై తిరిగేవారిమని, హిమాచల్ ప్రదేశ్‌లో నడ్డాతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తానని మోడీ తెలిపారు.
ప్రతీ కార్యకర్తనూ గుర్తుపట్టడమే నడ్డా ప్రత్యేకత అని మోడీ కొనియాడారు.

నడ్డా పదవికాలం గురించి స్వరం వినిపించిన మోడీ…ఇది ఈ రోజు బీజేపీని ఇలా ఉంచిన సంఘర్ష్(ఫైట్),సంఘథన్(ఆర్గనైజేషన్). కొంతకాలం ఇక్కడ ఉండటానికి మనం రాలేదు. దీర్ఘకాలం మాతృదేశానికి సేవచేయడానికి ఇక్కడ ఉన్నాం అని అన్నారు. ఐదేళ్లూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యుత్తమ కార్యకర్త అని, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షా యొక్క గొప్ప సహకారానికి పదాలు న్యాయం చేయగలవని తాను అనుకోనని మోడీ అన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవ వెలకట్టలేనిదని మోడీ కొనియాడారు. అమిత్ షా కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవచేసేందుకు పార్టీకి అవకాశం లభించిందని మోడీ అన్నారు.
 
తామేం తప్పుడు విధానాలను అవలంబించలేదని, అందుకే ప్రజలు తమను ఆశీర్వదిస్తూ వస్తున్నారని మోడీ అన్నారు. ప్రజలు అలా ఆశీర్వదించడమే తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే వారికి తప్పులా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు వ్యతిరేకించిన ఆ వ్యక్తుల వద్ద ఆయుధాలేమీ లేవని, కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే వారి ఆయుధమని మోడీ సెటైర్లు వేశారు.