ఐక్యత చాటిన భారత్ : దీపం వెలిగించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 04:19 PM IST
ఐక్యత చాటిన భారత్ : దీపం వెలిగించిన మోడీ

కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం.

ప్రధాని మోడీ కూడా తన నివాసంలో 9గంటలు అవగానే లైట్లు ఆపి సాంప్రదాయ దుస్తులు ధరించి తన ఇంటి ఆవరణలో దీపం వెలిగించి సంఘీభావం తెలిపారు. మోడీ దీపం వెలిగించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా రాష్ట్రపతి భవన్ ముందు కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తులు పట్టుకుని నిలబడ్డారు. దీపాల వెలుగుతో కరోనా చీకట్లను తరిమేశారు భారతీయులు.

పలు రాష్ట్రాల సీఎంలు,మంత్రులు,కేంద్రమంత్రులు,పార్టీ నాయకులు,సెలబ్రిటీలు,ప్రముఖులు కూడా తమ ఇంటి వద్ద దీపాలు వెలిగించారు. దేశ ప్రజలు ఖచ్చితంగా గడియారంలో 9గంటల బెల్ మోగడంతో ఇళ్లల్లోని లైట్ స్విచ్ లు ఆఫ్ చేసి 9నిమిషాల పాటు దీపాలు,కొవ్వొత్తులను వెలిగించారు. దీపాలు,కొవ్వొత్తులు అందుబాటులో లేని వాళ్లు తమ ఫోన్లలోని టార్చ్ ను ఆన్ చేశారు. దీపాల వెలుగులో భారత్ వెలిగిపోయింది.