ఎర్రకోట వేదికగా…ఒన్‌ నేషన్‌-ఒన్‌ హెల్త్‌ కార్డుపై మోడీ ప్రకటన!

  • Published By: venkaiahnaidu ,Published On : August 14, 2020 / 08:28 PM IST
ఎర్రకోట వేదికగా…ఒన్‌ నేషన్‌-ఒన్‌ హెల్త్‌ కార్డుపై మోడీ ప్రకటన!

74వ ఇండిపెండెన్స్‌ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఒక దేశం… ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు.

అయితే ఈ పధకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే వదిలివేస్తారు. ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్‌ ఐడీని కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్‌లోకి లాగిన్‌ అవుతారు. దశలవారీగా అమలు చేసే ఈ పధకానికి రూ 300 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిపారు.

ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్‌ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిస్తారు.

ఆధార్‌ కార్డు తరహాలో హెల్త్‌ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ పధకాన్ని ఆపై మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌లో అనుసంధానిస్తారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు.