కశ్మీర్ విషయంలో జోక్యం వద్దని ట్రంప్ కి మోడీ తెగేసి చెప్పాడు

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 10:37 AM IST
కశ్మీర్ విషయంలో జోక్యం వద్దని ట్రంప్ కి మోడీ తెగేసి చెప్పాడు

కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ తెగేసి చెప్పినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానాలో శుక్రవారం(అక్టోబర్-11,2019) జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ…కశ్మీర్ విషయంలో ఏళ్ల తరబడి తమది అదే విధానమని, ఏ దేశం ఇందులో జోక్యం చేసుకున్నా సహించలేదని లేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు కావచ్చు, వేరెవరైనా కావచ్చు…కశ్మీర్ భారత్‌ లో అంతర్భాగం అన్నదే మా వాదన. ఈ విషయాన్ని మోడీ చాలా స్పష్టంగా ట్రంప్‌కు చెప్పారు అని ఆయన అన్నారు.

జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దును ఎన్‌సీపీ వ్యతిరేకించిందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీ వైఖరోమిటో చెప్పాలని ఓటర్లే ఆ పార్టీని నిలదీయాలని అమిత్‌షా అన్నారు. ఆర్టికల్ 370రద్దుతో 70 ఏళ్లుగా ఏ ప్రధాని చేయని సాహసం మోడీ చేశారని చెప్పారు. ‘370 అధికరణ రద్దు చేసే రక్తం ఏరులై పారుతుందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పార్లమెంటులో చెప్పారు. అయితే ఆ అధికరణ రద్దు చేసిన తర్వాత ఒక్క రక్తం బొట్టు కూడా చిందలేదన్న విషయాన్ని నేను మీకు చెప్పదలచుకున్నాను’ అని ఆయన అన్నారు. 

కాంగ్రెస్ పై కూడా ఈ సందర్భంగా షా తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం కాంగ్రెస్ యూకే డెలిగేషన్ బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ తో సమావేశమై కశ్మీర్ విషయమై చర్చలు జరపడంపై షా విమర్శలు గుప్పించారు. కశ్మీర్ విషయంలో బ్రిటన్ నాయకుడితో కాంగ్రెస్ విదేశీ బృందం చర్చలు జరిపినందుకుగాను రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పితీరాలని షా అన్నారు. ఇటీవల కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుందని,ఐక్యరాజ్యసమితి కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ బ్రిటన్ లేబర్ పార్టీ తీర్మాణం చేసిన విషయం తెలిసిందే.