అసోం వరదలపై బాధపడని మోడీ..ఆమె ట్వీట్ పై బాధపడున్నారు : ప్రియాంకగాంధీ

అసోంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు.

అసోం వరదలపై బాధపడని మోడీ..ఆమె ట్వీట్ పై బాధపడున్నారు : ప్రియాంకగాంధీ

Priyanka

Priyanka Gandhi అసోంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం అసోంలోని జోర్హాట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ.. టూల్​కిట్​ వ్యవహారంంలో కాంగ్రెస్​ పాత్ర ఉందంటూ శనివారం అసోం పర్యటనలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది వరదల వల్ల అసోం ప్రజలు ఇబ్బంది పడినా పట్టించుకోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..22 ఏళ్ల యువతి(దిశారవి​) ట్వీట్​పై బాధపడుతున్నారని విమర్శించారు.

ప్రియాంకగాంధీ మాట్లాడుతూ..నేను నిన్న ప్రధాని ప్రసంగం విన్నాను. అసోం అభివృద్ధి గురించో లేదా.. అసోంలో బీజేపీ చేసినదాని గురించో మాట్లాడతారని అనుకున్నాను. కానీ, టూల్​కిట్ గురించి విచారం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. 22 ఏళ్ల యువతి(దిశారవి) చేసిన ట్వీట్​ గురించి ఆయన మాట్లాడటం విని నేను షాక్​ అయ్యాను. భారత తేయాకు రంగాన్ని నాశనం చేయాలనుకునే వారికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్దతు ఇస్తోందని ప్రధాని ఆరోపించారు. అయితే, అసోం ప్రజలు వరదల్లో మునిగిపోతున్నప్పుడు ప్రధాని ఎందుకు అసోంకు రాలేదు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు ఎందుకు బాధపడలేదు? ఎప్పుడైనా తేయాకు కార్మికుల వద్దకు వెళ్లి, వారి సమస్యలను విన్నారా అని ప్రియాంకగాంధీ మోడీని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా ప్రధానిలో కనీస పశ్చాత్తాపం లేదని అన్నారు.

అసోంలో తమది డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం అని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంకగాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి హిమంత బిస్వా శర్మ, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మధ్య వైరాన్ని ఉదహరిస్తూ..అసోంలో ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన సాగుతోందని ప్రియాంక ఎద్దేవా చేశారు. అసోంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని ప్రధాని చెప్పారు, కాని అసోంలో ఇద్దరు సిఎంలు ఉన్నారు. ఏ ఇంజిన్ ఏ ఇంధనాన్ని నడుపుతుందో నాకు తెలియదు. అసోంలో అసోం ప్రభుత్వం నడపడం లేదు … దేవుడు మిమ్మల్ని కాపాడాలి అని ర్యాలీకి హాజరైనవారిని ఉద్దేశించి ప్రియాంక మాట్లాడారు.

సమాజంలోని అన్నిరంగాల వారిని బీజేపీ ప్రభుత్వం మోసగించిందని ప్రియాంక ఆరోపించారు. ఉపాధి కల్పన, అస్సాం ఒప్పందం, తేయాకు కార్మికుల కూలీ పెంపు హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని అన్నారు. యువతకు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మాట తప్పింది. సంస్కృతి పరిరక్షణకు అస్సాం ఒప్పందంలోని క్లాజ్‌ -6ను అమలు చేయలేదు. రాష్ట్రంలో పౌర సవరణ చట్టం అమలు చేయమన్న హామీపైనా బీజేపీ వెనకడుగు వేస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పలు సామాజిక మాధ్యమాల్లో ప్రధాని కన్నీరుకారుస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయని.. అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికినప్పుడు ఆయన కన్నీరు ఏమైంది అని ప్రియాంక నిలదీశారు.

ఇక, 126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి మార్చి-27నుంచి ఏప్రిల్-6వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.