PM, Sonia Gandhi : స్పీకర్ దగ్గరికి కలిసి వెళ్లిన మోదీ,సోనియా

ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్‌స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

PM, Sonia Gandhi : స్పీకర్ దగ్గరికి కలిసి వెళ్లిన మోదీ,సోనియా

Modi Sonia

PM, Sonia Gandhi ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్‌స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. లోక్​సభ సమావేశాల వాయిదాపై నేతలతో చర్చలు జరిపినట్లు స్పీకర్​ ఓం బిర్లా తెలిపారు. భవిష్యత్తులో సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరినట్లు ఓం బిర్లా ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

బిర్లాతో భేటీలో.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్​, శిరోమణి అకాలీ దళ్, వైసీపీ, బీజేడీ​ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

కాగా, పెగసస్‌ హ్యాకింగ్‌,వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో ఇవాళ లోక్​సభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వ‌ర్షాకాల సమావేశాల్లో భాగంగా జూలై 19న ప్రారంభ‌మైన లోక్‌స‌భ..షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉన్నప్పటికీ విపక్షాల ఆందోళనల మధ్య చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రెండు రోజుల ముందే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

లోక్‌స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసిన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. స‌భా వ్య‌వ‌హారాలు ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌క‌పోవ‌డం త‌న‌ను బాధించిన‌ట్లు చెప్పారు.ఈ సెష‌న్‌లో 74 గంట‌ల 46 నిమిషాల పాటు లోక్ స‌భ కార్య‌క్ర‌మాలు జరిగాయని, కేవ‌లం 22 శాతం మాత్ర‌మే ప్రొడ‌క్టివిటీ రికార్డు అయ్యింద‌ని తెలిపారు. ఈసారి 20 బిల్లులు పాసైన‌ట్లు స్పీక‌ర్ బిర్లా చెప్పారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల స‌భ్యులు స‌హ‌క‌రించిన‌ట్లు బిర్లా తెలిపారు.