SCO సమ్మిట్ : చైనాపై మోడీ మాటల దాడి

  • Published By: venkaiahnaidu ,Published On : November 10, 2020 / 04:49 PM IST
SCO సమ్మిట్ : చైనాపై మోడీ మాటల దాడి

PM’s Message At Regional SCO Meet షాంఘై సహకార సంస్థ(SCO)20వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-10,2020)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొని మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలా నెలల గ్యాప్ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్- మోడీ మధ్య జరిగిన మొదటి మీటింగ్ ఇదే కావడం విశేషం.



కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఎకానమీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మోడీ వ్యాఖ్యానించారు.కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచానికి విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌ ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సరిహద్దుల్లో చైనా ఆగడాలు,పెరుగుతున్న ఉగ్రవాదం వంటి విషయాలను ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరోక్షంగా చైనా,పాక్ ను ఉద్దేశించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.



ద్వైపాక్షిక అంశాలను ఈ వేదికపై ప్రస్తావించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం దురదృష్టకరమని మోడీ అన్నారు. ఇది ఎస్​సీఓ చార్టర్ ​కు, షాంఘై స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. షాంఘై సహకార సంస్థతో భారత్​ కు బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పడం చాలా ముఖ్యమని, అయితే ఇతరుల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని హితవు పలికారు.