ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు..ఘాజీబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు

  • Published By: bheemraj ,Published On : November 29, 2020 / 08:38 PM IST
ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు..ఘాజీబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Ghaziabad Police block farmers : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దులో రైతులు భారీగా మోహరించారు. ఇప్పటివరకు సింఘు, గాజీపూర్‌ బోర్డర్‌కే పరిమితమైన రైతుల ఆందోళనలు.. ప్రస్తుతం ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్‌లో మొదలయ్యాయి.. వందలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఏదీ ఏమైనా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి చేరుకొని నిరసన కార్యక్రమం కొనసాగించాలని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు..



మరోవైపు డిసెంబరు 3న రైతు సంఘాల నేతలతో చర్చలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు హోంమంత్రి అమిత్‌ షా. అప్పటివరకు రైతులు ఆందోళనను విరమించాలని సూచించారు.. కానీ రైతులు మాత్రం ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఆందోళన తెలపడానికి అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం బురారీలోని నిరంకారీ మైదానంలో ఆందోళనకు అనుమతించింది. మొత్తం ఏడు రాష్ట్రాల రైతులు ఢిల్లీకి చేరుకొని ఆందోళన నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి..



వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన రైతులు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. బురారీ గ్రౌండ్‌కు షిఫ్ట్‌ కావాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. బురారీ మైదానాన్ని రైతులు ఓపెన్‌జైలుగా అభివర్ణించారు. ఢిల్లీకి వెళ్లే ఐదు మార్గాలను బ్లాక్‌ చేశారు రైతులు. కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన నాల్గవరోజు కూడా కొనసాగింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు వద్ద రైతులు బైఠాయించారు. సరిహద్దు నుంచి ఢిల్లీలోని బురారీ మైదానానికి వెళ్లాలని, అక్కడ ఆందోళన చేసేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతిస్తారని హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటనను రైతులు తిరస్కరించారు.



బురారీ మార్గాన్నిరైతులు ఓపెన్‌ జైలుగా పేర్కొన్నారు. రామ్‌లీలా మైదానం లేదా జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు అనుమతించాలని కోరారు. కేంద్రం తమ ఆందోళనను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కార్పోరేటర్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను మార్చాలని కోరుతున్నారు. కనీస మద్దతు ధర, పంటల కొనుగోలుపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని, ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.



రైతుల ఆందోళనపై వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ స్పందించారు. భారత ప్రభుత్వం రైతులతో ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిపిందని, డిసెంబర్‌ 3న నాల్గవ విడత చర్చలు జరపాల్సి ఉందన్నారు. రైతు నేతలు చర్చలకు అనుకూల వాతావరణం ఉండేలా చూడాలన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌లో స్పందించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు కొత్త హక్కులు, అవకాశాలను కల్పిస్తాయన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే.. వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో చట్టబద్ధత లభించిందని చెప్పారు.



ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు వద్ద రైతులు బైఠాయించారు. ఢిల్లీలోని బురారీ నిరంకారి గ్రౌండ్‌కు వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్‌ ఇచ్చారు. రైతులు మాత్రం సరిహద్దు నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుదీర్ఘ ఆందోళనకు సిద్ధమై వచ్చిన రైతులు నాలుగు నెలలకు సరిపడా రేషన్‌, నీళ్లు వెంట తెచ్చుకున్నారు.