పెళ్లిళ్లో మద్యానికి నో చెప్పే వధువుకు నగదు బహుమతి

పెళ్లిళ్లో మద్యానికి నో చెప్పే వధువుకు నగదు బహుమతి

Alcohol-

Alcohol Weddings : భారతదేశంలో పెళ్లిళ్లు అనేక రకాలుగా జరుగుతుంటాయి. వివిధ ప్రాంతాల్లో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వివాహాలు నిర్వహిస్తుంటారు. పెళ్లి అనగానే..సందడి సందడితో పాటు..గ్లాసుల గలగల వినిపిస్తుంటాయి. బాటిళ్లు..బాటిళ్లు ఖాళీ అవుతాయి. మందు లేనిదే..పెళ్లికి రామని కూడా ఖచ్చితంగా కొంతమంది చెప్పేస్తుంటారు. కొంతమందికి ఆర్థిక భారమైనా..అప్పులు తెచ్చి అయినా..మందు పార్టీ ఇస్తుంటారు. నిరుపేదలను ఆర్థికంగా దెబ్బ తీస్తోంది.

ఇలాంటి పద్ధతులను నిషేధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రయత్నం చేసినా..ఫలితం కనిపించ లేదు. దీంతో ఓ పోలీసు అధికారులు వినూత్నంగా ముందుకొచ్చారు. మందు పార్టీలను అడ్డుకొనే వధువుకు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్ మారుమూల ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకల్లో వచ్చే అతిథులందరికీ..మద్యం అందించాలనే సంప్రదాయం ఉంది. వీరిలో మార్పు తెచ్చేందుకు తెహ్రీ గఢ్వాల్ జిల్లాలోని దేవప్రయాగ్ పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.

‘భూలీ కన్యాదాన్’ పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక గర్వాలీ భాషలో భూలీ అంటే సోదరి అనే అర్థం. మందు పార్టీలు వద్దు అనుకొనే వధువుకు రూ. 10 వేల 001 బహుమతిగా అందించనున్నామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ రావత్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ లో సుమారు 22 మంది సిబ్బంది ఉన్నారు. ఈ డబ్బును తాము సొంతంగానే సమకూర్చుకుంటామని వారు చెప్పారు. మందు పార్టీలు నిర్వహించడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా..వివాదాలు, గొడవలకు కారణమౌతున్నాయి.

వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే భూలీ కన్యాదాన్ తీసుకొచ్చామని రావత్ తెలిపారు. తమ నిర్ణయానికి మద్దతు ఇచ్చే వధువులకు నగదు బహుమతి ఇస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇటీవల గ్రామాల పెద్దలతో ఒక సమావేశం నిర్వహించారు. వారు కూడా ఈ ఆలోచనను ప్రశంసించారు. మందు పార్టీలను నిరోధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.