UP Election 2022: నేడే యూపీలో 59స్థానాల్లో పోలింగ్.. లఖింపూర్ ఖేరీ, రాయ్‌బరేలీలో కూడా!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్నాయి. ఈరోజు(23 ఫిబ్రవరి 2022) తొమ్మిది జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది.

UP Election 2022: నేడే యూపీలో 59స్థానాల్లో పోలింగ్..  లఖింపూర్ ఖేరీ, రాయ్‌బరేలీలో కూడా!

Voting

UP Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్నాయి. ఈరోజు(23 ఫిబ్రవరి 2022) తొమ్మిది జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో 51 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ సమయంలో ఎస్పీకి నాలుగు, బీఎస్పీకి మూడు, బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్-సోనేలాల్‌కు ఒక సీటు లభించింది. నాల్గవ దశ ప్రచారం ‘హై వోల్టేజీ’గా సాగడంతో ఎవరు పైచేయి సాధిస్తారు అనేదానిపై స్పష్టత రాలేదు. అధికార బీజేపీ టార్గెట్‌ ఎస్పీనే కాగా.. అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు విధించిన శిక్షపై బీజేపీ ఎస్పీపై తీవ్ర దాడిని ప్రారంభించింది. ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపే పార్టీగా ఎస్పీపై దాడిచేసింది.

మరోవైపు, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ కూటమి బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్ల నుంచి ఓట్లు అభ్యర్థించింది. తొలి మూడు దశల ఎన్నికల్లో ఎస్పీ కూటమికి గట్టి సపోర్ట్ లభించిందని, ఈసారి ఎన్నికల్లో బీజేపీకి చారిత్రాత్మక ఓటమి తప్పదని అఖిలేష్ ఇప్పటికే చాలా ర్యాలీల్లో ప్రస్తావించారు. అదే సమయంలో, BSP అధ్యక్షురాలు మాయావతి అనేక ర్యాలీలు నిర్వహించి, SP, BJP మరియు కాంగ్రెస్‌లను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. BSP మాత్రమే రాష్ట్ర ప్రజలకు నిజమైన సుపరిపాలన అందించగలదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ వివిధ చోట్ల రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించి పార్టీ అభ్యర్థులకు ఓట్లు అడిగారు. మతం, కులం ప్రాతిపదికన పార్టీలకు ఓటు వేయవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అక్టోబర్ 3న టికోనియా గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందడంతో వెలుగులోకి వచ్చిన లఖింపూర్ ఖేరీలో కూడా నాలుగో దశలోనే పోలింగ్ జరగనుంది.

నాల్గవ దశలో అభ్యర్థులు:
నాల్గవ దశలో ఖ్యాతి గడించిన ప్రముఖ అభ్యర్థులలో రాష్ట్ర న్యాయ మంత్రి బ్రిజేష్ పాఠక్(లక్నో కాంట్), మంత్రి అశుతోష్ టాండన్(లక్నో ఈస్ట్), మాజీ మంత్రి ఎస్పీ అభ్యర్థి అభిషేక్ మిశ్రా(సరోజినీ నగర్), ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ నితిన్ అగర్వాల్ (హర్దోయ్), నెహ్రూ-గాంధీ కుటుంబానికి ‘కంచుకోట’గా భావించే రాయ్‌బరేలీలో కూడా నాలుగో దశలోనే ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన అదితి సింగ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.