పూజా చౌహాన్ సూసైడ్ కేసు : మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

పూజా చౌహాన్ సూసైడ్ కేసు : మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

Pooja Chavan death case : మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైంది. ఈ నెల 8వ తేదీన పూణెకు చెందిన టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య చేసుకోగా.. ఆ కేసులో కేబినెట్ మంత్రి సంజయ్ రాథోడ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూజా ఆత్మహత్యకు సంజయ్ కారణమని, అతని వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంజయ్ రాజీనామా చేయాలని, అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

పూజా చౌహాన్ బిల్డింగ్‌పై నుంచి దూకి మరణించిన తర్వాత.. రెండు వారాల పాటు సంజయ్ రాథోడ్ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దీంతో సంజయ్ వల్లే ఆమె మరణించిందనే ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా గతంలో పూజా చౌహాన్‌తో సంజయ్ రాథోడ్ దిగిన ఫోటోలు, వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్ ఆడియో క్లిప్స్ బయటకు రావడం వైరల్‌గా మారింది. దీంతో అతన్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ మహిళా మోర్చ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. స్వయంగా మంత్రులే వారి ప్రాణాలు తీస్తున్నారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవేపు కేసు విచారణ జరుగుతుండగా.. దానిని సంజయ్ ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. అతన్ని తొలగించాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో తనకు, పూజా ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని సంజయ్ రాథోడ్ ప్రకటించారు. ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో పోలీసులు తేలుస్తారని, కేసు విచారణ సజావుగా సాగేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో ప్రభుత్వానికి ఈ ఘటన తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ అంశాన్ని సభలో ప్రధానంగా ప్రస్తావించి.. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలని ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినాథాక్రే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే బీజేపీ.. ఈ ఘటనను మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.