యూపీలో ఎస్పీ వ్యూహం : రాజ్ నాథ్ పై శతృఘ్నసిన్హా భార్య పోటీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2019 / 12:03 PM IST
యూపీలో ఎస్పీ వ్యూహం : రాజ్ నాథ్ పై శతృఘ్నసిన్హా భార్య పోటీ

కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజ్ నాథ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలలో ఎస్పీ-బీఎస్పీ కూటమి ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహంతో లక్నోలో అభ్యర్థిని నిలబెట్టకుండా పూనమ్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఎస్పీ-బీఎస్పీ కూటమి పోటీ చేసే ఏడు స్థానాల్లో తాము అభ్యర్థులను నిలబెట్టబోమంటూ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ఏడు స్థానాల్లో లక్నో కూడా ఒకటి.దీంతో లక్నోలో రాజ్ నాథ్-పూనమ్ ల మధ్య నువ్వా-నేనా అన్న రేంజ్ లో టఫ్ ఫైట్ జరుగనుంది.

2014ఎన్నికల్లో మొత్తం లక్నో నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 55.7శాతం ఓట్లు సాధించి రాజ్ నాథ్ సింగ్ ఎంపీగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.లక్నో పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది కయస్థ,1.3లక్షల మంది సింధి వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు.3.5లక్షల మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు.పూనమ్ సిన్హా సింధి వర్గానికి చెందిన మహిళ కాగా శతృఘ్న సిన్హా కయస్థ వర్గానికి చెందినవారు.ఈ ఈక్వేషన్స్ తో పూనమ్ ను బరిలో దించితే రాజ్ నాథ్ కు ఈజీగా  చెక్ పెట్టవచ్చునని సీనియర్ ఎస్పీ నాయకుడు తెలిపారు.

బీజేపీ ఎంపీగానే ఉంటూ తరచూ మోడీ సర్కార్ పై విమర్శలు చేసే శతృఘ్నసిన్హా ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో సమావేశమయ్యారు.ఏప్రిల్-6,2019న అధికారికంగా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సిన్హా ప్రకటించారు.బీహార్ లోని పాట్నా లోక్ సభ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిన్హా పోటీ చేయనున్నారు.