పేదింటిలో బకాసురుడు : అన్నంమంతా ఒక్కడే తినేస్తున్నాడని కొడుకుని గొలుసులతో కట్టేసిన తండ్రి

  • Published By: nagamani ,Published On : June 28, 2020 / 07:13 PM IST
పేదింటిలో బకాసురుడు : అన్నంమంతా ఒక్కడే తినేస్తున్నాడని కొడుకుని గొలుసులతో కట్టేసిన తండ్రి

కన్నబిడ్డలు అన్నం సరిగ్గా తినకపోతే..ఇంకో ముద్ద తినమ్మా..మళ్లీ ఆకలేస్తుంది..అంటూ తినిపిస్తాం. కానీ ఓ తండ్రి కొడుకు అన్నం ఎక్కువగా తినేస్తున్నాడని కన్నకొడుకుని ఇనుప గొలుసులతో కట్టేసి కడుపు మాడ్చేసిన విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌ కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారణం ఆ కొడుకుపై తండ్రికి ఉన్నది కోసం కాదు..ఓపేద తండ్రి దుస్థితి అది. ఇంట్లో అందరికీ వండిన అన్నం ఒక్కడే తినేస్తున్న కొడుకుపై ఆ పేద తండ్రి దారుణ దుస్థితికి అద్దం పట్టే ఘటన ఇది.

కౌశాంబి జిల్లాలోని సైనీ ప్రాంతంలో కందైలాల్‌ అనే నిరుపేద కుటుంబం కష్టం చేసుకుని జీవిస్తోంది. వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ వచ్చే అతి కొద్దిపాటి ఆదాయంతో బ్రతికే కుటుంబం కందైలాల్ ది. పని చేస్తేనే పూట గడుస్తుంది. లేదంటే పస్తులే. నీళ్లు తాగి పడుకోవాల్సిందే. అది ఈ ఇంట్లో పరిస్థితి.
కానీ దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్లుగా.. ఇంట్లో వారంతా పని చేస్తున్నా అతని కొడుకు విజయ్ మాత్రం ఏపనీ చేయకుండా బలాదూర్‌గా తిరిగే వాడు. తండ్రి పని చేయాలని ఎంత చెప్పినా వినిపించుకునే వాడు కాదు. కానీ కన్నకొడుకే కదాని ఏమీ అనేవాడు కాదు. పనిచేయటం ఎంత అవసరమో చెబుతుండేవారు.

కానీ వినకుండా తినటం తిరగటం తప్ప మరో పనిలేని కొడుకు మాత్రం చక్కగా ఇంట్లో వండిన అన్నాన్ని మొత్తం తినేసేవాడు. కష్టపడి పనిచేసేవారికి తినటానికి ఏమన్నా ఉందో లేదో చూసుకునేవాడు కాదు. అలా ఓ రోజు అతడు ఇంటికి వచ్చి ఎవరికి అన్నం మిగల్చకుండా తినేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇంటికి వచ్చినవారకి తినటానికి ఏమీ లేదు. వండుకోవటానికి ఇంట్లో బియ్యం కూడా లేవు. దీంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఆకలితో మాడిపోయారు. ఎన్నో రోజులుగా బలాదూర్ కొడుకుని భరిస్తున్న ఆ తండ్రి కోపంతో ఊగిపోయాడు.

నీకు ఎంత చెప్పినా బుద్ది రాదురా..నీ పని చెబుతానుండు..అంటే ఓ ఇనుప గొలుసు పట్టుకొచ్చి కొడుకుని గొలుసులతో కట్టిపడేశాడు. ఆకలి బాధ అంటే ఏంటో నీకుతెలియాలి అంటూ అన్నం పెట్టకుండా కడుపు మాడ్చాడు. అలా అతను ఆకలితో అలమటించిపోతూ నీరసించిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి అన్నం పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కందైలాల్ ఇంటికి వచ్చిన పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఇంట్లో ఆర్థిక కష్టాలకు తోడు పని చేయకుండా ఎక్కువ అన్నం తింటున్నాడని..అన్నం తిన్నా తనకు బాధ లేదని కానీ, పని చేసే వారంతా ఆ రోజు ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సి వచ్చిందని అందుకే కట్టేయాల్సి వచ్చిందని కన్నీటితో ఆ తండ్రి చెప్పిన మాటలకు వారి దుస్థితి చూసి పోలీసులు కూడా చలించిపోయారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనుకుంటూ..నీరసంగా ఉన్న కొడుకుని హాస్పిటల్ కు తరలించారు. పేదలకు ఆహారం అందిస్తున్నామని చెప్పుకునే పాలకులకు ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.