NRCలో ముందడుగు పడింది : NPR అప్ డేట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : December 24, 2019 / 10:16 AM IST
NRCలో ముందడుగు పడింది : NPR అప్ డేట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్‌(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్‌పీఆర్‌ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది.  ఎన్‌పీఆర్‌ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచేయనుంది. దేశంలోని ప్ర‌తి ఒక్క పౌరుడి పూర్తి డేటాబేస్‌ను త‌యారు చేయ‌డ‌మే ఎన్‌పీఆర్ ల‌క్ష్య‌మ‌ని సెన్స‌స్ క‌మిష‌న్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 

ఎన్‌పీఆర్ చేయాలంటే…పౌరులు ఎవ‌రైనా ఒక ప్రాంతంలో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉన్న‌వారే అర్హులు. దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఎన్‌పీఆర్‌లో తప్పనిసరిగా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనాభా లెక్క‌ల‌(సెన్స‌స్‌)కు ఎన్‌పీఆర్ అనుసంధాన‌మై ఉంటుంది. దీని ఆధారంగానే నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్‌(NRC) ప‌ట్టిక‌ను త‌యారు చేస్తారు. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య కాలంలో ఎన్‌పీఆర్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్నారు. దీనికోసం ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదు. ప్రజల నుంచి ఎలాంటి ఆధారాలూ స్వీకరించడం లేదు. బయోమెట్రిక్ కూడా తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఇందుకోసం స్పెషల్‌ మొబైల్‌ ఆప్‌ తీసుకొస్తామన్నారు.  ప్రజలు ఈ యాప్‌ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుందని జావడేకర్ తెలిపారు.

అస్సాం మిన‌హా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఎన్‌పీఆర్‌ గణాంకాలను మొదటిగా 2010లో సేకరించారు. 2011 భారత జనాభా లెక్కల్లో ఇండ్ల జాబితా దశలో భాగంగా ఎన్‌పీఆర్‌ను కూడా నాటి యూపీయే ప్రభుత్వం సేకరించింది. 2015లో ఎన్‌పీఆర్ డేటాను ఇంటింటి స‌ర్వే ద్వారా అప్‌డేట్ చేశారు. ఆ డేటా డిజిటైజేష‌న్ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు.

మన దేశంలో ప్రతీ పదేళ్లకొకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. గత సేకరణ 2011లో జరిగింది. అంటే 2021లో మళ్లీ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. జనాభా లెక్కల సేకరణ చేపట్టేముందు ఎన్ని ఇళ్లు ఉన్నాయి అన్న జాబితా ప్రతీ గ్రామానికీ, పట్టణానికీ తయారు చేస్తారు. ఇది 2020 ఏప్రిల్‌ నుండి సెప్టెంబరు మధ్యలో చేపట్టనున్నారు. ఐతే ఈ సారి మోడీ ప్రభుత్వం ఈ ఇళ్ల జాబితా తయారీతో బాటుగా జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌పిర్‌)ను రూపొందించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆదేశాలను రాష్ట్రాలకు జారీ చేసింది.

ఈ జాతీయ జనాభా రిజిస్టరు ఏమిటి?
జనాభా లెక్కల సేకరణ కోసం చేసిన జనాభా లెక్కల చట్టం 1948 (సెన్సస్‌ యాక్ట్). దీనిలో జనాభా రిజిస్టరు ప్రస్తావన ఏమీ లేదు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి 2004లో సవరణ చేశారు. అందులో ప్రతీ పౌరుడికి జాతీయ గుర్తింపు కార్డు ఉండాలని నిర్ధేశించారు. అందరు పౌరుల వివరాలతో జాతీయ పౌరసత్వ రిజిస్టరు (ఎన్‌ఆర్‌సి లేదా ఎన్‌ఆర్‌ఐసి) ను నిర్వహించాలని కూడా చట్టం చెప్తోంది. అయితే 2005లో సుప్రీం కోర్టు ఒక తీర్పులో జాతీయ పౌరసత్వ రిజిస్టరు తయారీ ప్రక్రియను సమస్య ఉన్న అస్సాం ప్రాంత రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఆదేశించింది. 2004లో చేసిన చట్ట సవరణను నేరుగా రద్దు చేయకపోయినా, ఎన్‌ఆర్‌సిని దేశమంతకీ విస్తరించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశం మాత్రం ఉంది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మళ్లీ ఎన్‌ఆర్‌సి ప్రక్రియకు తెరతీసింది. ఈ NRC తయారులో మొదటిమెట్టు జాతీయ జనాభా రిజిస్టరు (NPR). గత ఆరు నెలలుగా ఒకే స్థలంలో నివసిస్తూ, రానున్న ఆరు నెలల వరకూ కూడా అక్కడే నివాసాన్ని కొనసాగించబోయే వారందరికీ జాతీయ జనాభా రిజిస్టరులో చేరుస్తారు. దీనితోపాటు కుటుంబ పెద్దకు సంబంధించిన 29 రకాల వివరాలు సేకరిస్తారు. వీటిలో వయసు, వృత్తి, పుట్టిన స్థలం, మాతృభాష, మతం, కులం వంటికి ఉంటాయి. ఈ వివరాలు ఆధారంగా రూపొందే జనాభా రిజిస్టరు నుంచి జాతీయ పౌరసత్వ రిజిస్టరు తయారు చేస్తారు. ఎన్‌ఆర్‌సి తయారీ ముందు ”ఎవరి పౌరసత్వం అనుమానాస్పదమో” అటువంటి వారందరి జాబితానూ రూపొందించి వేరు చేస్తారు. ఆ అనుమానస్పదుల జాబితాలో చేరిన వారంతా తమ పౌరసత్వాన్ని ఆధారాలతో రుజువు చేసుకోవాలి. అంటే ఎన్‌ఆర్‌సి తయారీలో తొలి మెట్టు జాతీయ జనాభా రిజస్టరు (ఎన్‌పిఆర్‌).

ఆధార్‌ ఉండగా వేరే గుర్తింపు కార్డు అవసరమా?
ఈ విషయంలో ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు గతంలో వచ్చాయి. హోం శాఖ ఎన్‌పిఆర్‌ ప్రక్రియ చేపట్టాలని భావించగా, ఆధార్‌ కోసం ఏర్పడిన యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తానూ అదే పని చేస్తున్నందున రెండు సార్లు అదే వివరాలను ప్రజల నుండి సేకరించనవసరమేమిటని ప్రశ్నించింది. ఇప్పటికే ఆధార్‌లో వివరాలిచ్చిన వారి నుండి మళ్లీ ఎన్‌పిఆర్‌ కోసం వివరాలు సేకరించనవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఆధార్‌తో నిమిత్తం లేకుండా మళ్లీ ఎన్‌పిఆర్‌ తయారు చేయాలని ఆదేశించింది మోడీ ప్రభుత్వం. 2005లోనే సుప్రీం ఎన్‌ఆర్‌సి దేశం మొత్తానికి చేపట్టవద్దని చెప్పినా, ఆధార్‌ ఉండగా మళ్లీ ఎన్‌పిఆర్‌ కోసం వివరాల సేకరణ అవసరంలేదన్న గత నిర్ణయం ఉన్నా, వాటిని తిరగదోడింది మోడీ ప్రభుత్వం. ఈ ప్రక్రియ మొదలుపెట్టేమునుపే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చింది. ముస్లింలకు అందులో పౌరసత్వం నిరాకరించింది. తక్కిన మతాల వారు ఇతర దేశస్తులైనా స్వాగతించింది. ఇంతటి వివాదాస్పదమైన వ్యవహారం గనుకనే ఎన్‌ఆర్‌సిని మెజార్టీ రాజకీయ పార్టీలు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాలతో బాటు ఎన్డీయే భాగ స్వామ్య పక్షాలైన అకాలీదళ్‌, జేడీ(యు), ఎల్‌జెపి వంటివి కూడా వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ చట్ట సవరణను బలపరిచి ఓటు వేసినప్పటికీ తర్వాత వైసీపీ,బీజేడీ వంటి పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి.ఎన్ఆర్సీని అమలుచేసేది లేదని తేల్చిచెప్పాయి.