విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం…భారం భగవంతుడిదేనన్న కుమార్తె

  • Published By: venkaiahnaidu ,Published On : August 12, 2020 / 03:49 PM IST
విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం…భారం భగవంతుడిదేనన్న కుమార్తె

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు ఆర్మీ ఆర్ అండ్ ఆర్​​ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా, తండ్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ.

ఇక నా తండ్రి భారం ఆ భగవంతుడిదే అంటూ శర్మిష్టా ముఖర్జీ ట్వీట్ చేసింది. తన తండ్రి కోలుకోవాలని కాంక్షిస్తూ ఆమె ట్విట్టర్​లో భావోద్వేగ పోస్ట్ చేశారు. గతేడాది ఆగస్టు 8న అత్యంత సంతోషకరమైన రోజు. ఆ రోజు నాన్న.. భారత అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్నారు. సరిగ్గా సంవత్సరం గడిచేసరికి ఆయన ఆరోగ్యం విషమించింది.ఆనందాన్ని, దుఃఖాన్ని… రెండింటినీ సమానత్వంతో అంగీకరించేలా దేవుడు నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ఆమె ఆ పోస్ట్ లో తెలిపారు.

కాగా,ఎండు రోజుల క్రితం నెలవారీ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ప్రణబ్ ముఖర్జీకి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, ఆయన పాజిటివ్ అని వచ్చింది. అదేసమయంలో మెదడులోని రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడంతో దానికి సర్జరీ చేశారు. ఈ బ్రెయిన్ సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ప్రస్తుతం ప్రణబ్, న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మరోపక్క ముఖర్జీ స్వగ్రామమైన పశ్చిమ బెంగాల్‌లోని గ్రామంలో మహా మృత్యుంజయ హోమాన్ని గ్రామస్థులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 84 ఏళ్ల వయసులో ఇంకోపక్క కరోనాతో కూడా బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ, తిరిగి కోలుకోవాలని జాతియావత్తూ ప్రార్థిస్తోంది.