కేంద్రం షాక్ : మూగబోనున్న ’ఆకాశవాణి’ 

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 03:17 PM IST
కేంద్రం షాక్ : మూగబోనున్న ’ఆకాశవాణి’ 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రేడియో శ్రోతలకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ ఆలిండియా రేడియో (ఏఐఆర్) జాతీయ ఛానల్ ను మూసివేయనున్నట్లు ప్రకటించింది. రేడియోను మూసివేయాలని ప్రసార భారతి నిర్ణయించింది. 1987 లో ప్రారంభమైన ఎయిర్ ఇండియా జాతీయ ఛానల్ రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా పని చేస్తుంది. ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. 31 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న ఆకాశవాణి ఇక మూగబోనుంది. పాటలు, నాటిక, వార్తలు, వినోద కార్యక్రమాలతోపాటు పలు ప్రసారాలు నిలిచిపోనున్నాయి.

ప్రసారాల హేతుబద్ధీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా రేడియో జాతీయ ఛానల్ ను మూసివేయాలని ప్రసార భారతి నిర్ణయించింది. ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గత నెల 24న ఏఐఆర్ డైరెక్టరేట్ కు తెలిపింది. దీంతో ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించారు. 

అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని ప్రసార భారతి నిర్ణయించింది. దీంతోపాటుగా అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురం నగరాల్లోని ప్రాంతీయ శిక్షణా అకాడమీలను రద్దు చేయనుంది. దీన్ని తక్షణమే అమలు చేయనున్నారు. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రాంతాల్లోని కార్యాలయాల్లో సర్దుబాటు చేయనుంది.

జాతీయ ఛానల్ కు సంబంధించిన ట్రాన్స్ మీటర్లు బలహీనంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐఆర్ ఉన్నతాధికారి తెలిపారు. ఛానల్ కు అందుబాటులో ఉన్న ట్రాన్స్ మీటర్లలో నాగపూర్ లోని ట్రాన్స్ మీటర్ మాత్రమే ఒక్క మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుతం డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదన్నారు. ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్ సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఏఐఆర్ వెబ్ సైట్ ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.