క్షమాపణ చెప్పను…ఏ శిక్షకైనా సిద్ధం : ప్రశాంత్ భూషణ్

  • Published By: venkaiahnaidu ,Published On : August 20, 2020 / 03:56 PM IST
క్షమాపణ చెప్పను…ఏ శిక్షకైనా సిద్ధం : ప్రశాంత్ భూషణ్

కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్…శిక్షకు సంబంధించిన విచారణను రివ్యూ పిటిషన్ వేసేంత వరకూ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారంనాడు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టుపైన, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పైన చేసిన ట్వీట్లకు గాను ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ఈనెల 14న జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఏమేరకు శిక్ష విధించాలన్న అంశంపై ఆగస్టు 20న విచారిస్తామని ప్రకటించింది.

కాగా,ఈ కేసులో విచారణ వాయిదా వెయ్యాలని ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీం కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు. “శిక్షపై విచారణను వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. సమీక్ష పిటిషన్‌పై విచారణ తేలనంతవరకూ శిక్షపై విచారణ తారీఖుని వాయిదా వెయ్యాలని” ఆయన పిటిషన్‌లో వెల్లడించారు.

గురువారం సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే.. శిక్షపై విచారణ గురించి తమ వాదనను వినిపించారు. ముప్పై రోజుల్లో సమీక్ష పిటిషన్ దాఖలు చేసే హక్కు మాకు ఉంది అని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. నేరాన్ని రుజువు చేయడం, శిక్షించడం రెండు వేర్వేరు విషయాలు. నా అప్పీల్ న్యాయబద్ధమైనది. శిక్షను వాయిదా చేయవచ్చు. అంతమాత్రాన ఆకాశం ఊడిపడిపోదు అని దవే అన్నారు.

రివ్యూపిటిషన్ దాఖలు చేసి, దానిపై కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేంతవరకూ తనకు వేసే శిక్షకు సంబంధించిన విచారణను వాయిదా వేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. ఆ విజ్ఞప్తిని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోనే బెంచ్ తోసిపుచ్చింది. భూషణ్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవేను జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నిస్తూ… మేము ఎప్పుడూ మీ పట్ల ఎలాంటి అరమరికలు లేకుండా ఉన్నాం. మీరు కూడా మా విషయంలో ఫెయిర్‌గా ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నాం’ అన్నారు. పునర్విచారణ పిటిషన్ వేసేవరకూ, శిక్ష పడదని కోర్టు హామీ ఇస్తోంది” అని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రశాంత్ భూషణ్ తన వాదనను వినిపించారు. “కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేల్చినందుకు చాలా బాధగా ఉంది” అని అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే భిన్న ఆలోచనలకు ఆస్కారం ఉండాలి అని ఆయన అన్నారు. తన ట్వీట్లపై విచారం వ్యక్తం చేసేందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. ‘నేను తీవ్రమైన దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. కనికరం జూపించమని నేను కోరడం లేదు. ఔదార్యం చూపమని అడగటం లేదు. కోర్టు శిక్ష విధించాలనుకుంటే ఎలాంటి శిక్షనైనా నవ్వుతూ భరిస్తాను’ అని మహాత్మాగాంధీని ఉటంకిస్తూ ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టు భావించిన నా ట్వీట్లు… నా బాధ్యత. ఇంకేం కాదు. వాటిని వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చూడాలి. నేను రాసినది నా వ్యక్తిగత అభిప్రాయం. నా విశ్వాసాలు, అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు నాకు ఉంది అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.

దీని తరువాత, ప్రశాంత్ భూషణ్ శిక్షపై విచారణను వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శిక్ష విధించకుండా న్యాయమూర్తి నిర్ణయం పూర్తవ్వదు అని కోర్టు తెలిపింది. తన స్టేట్‌మెంట్‌ను పున పరిశీలించడానికి ప్రశాంత్ భూషణ్‌కు 2-3 రోజులు గడువు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.  అయితే సుప్రీం కోర్టు యొక్క ప్రతిపాదనను ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు. ‘ఇది ఏదైనా ఉపయోగకరమైన ప్రయోజనానికి ఉపయోగపడుతుందని అనుకోకండి’అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.