ప్రశాంత్ కిషోర్ వ్యూహం: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం

  • Published By: vamsi ,Published On : February 18, 2020 / 06:56 AM IST
ప్రశాంత్ కిషోర్ వ్యూహం: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం

పీకే.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్‌కు రాజకీయ వ్యూహ కర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్.. బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.

అయితే బీహార్‌లో కొద్ది రోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న కారణంతో ప్రశాంత్‌కిశోర్‌‌ను పార్టీ నుంచి బహిష్కరించింది అక్కడి అధికార పార్టీ జనతాదళ్‌-యునైటెడ్(జేడీయూ). ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బీహార్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీతో పాటు జేడీయూపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీహార్‌లో అభివృద్ధి లేదంటూ నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. “బీహార్‌కి బాత్” పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్.. బీహార్‌లో 100 రోజులు పర్యటించి, నితీష్ పాలనలో చెడు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు.

బీహార్ రాష్ట్రంలో బీహార్ కి బాత్ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన ప్రశాంత్ కిశోర్.. బీహార్‌లో అభివృద్ధి చూడాలనుకునే బీహారీ యువకులను తనతో పాటు ప్రచారంలో చేరేందుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 

అభివృద్ధిలో మిగతా రాష్ట్రాల కంటే ముందు ఉంచేలా కృషి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ప్రచారాన్ని మార్చి 20వ తేదీన ప్రారంభిస్తామని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. నితీష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని యాత్రను కొనసాగించనున్నట్లు ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

గాడ్సే భావజాలాన్ని విశ్వసించే వ్యక్తులతో నితీష్ కుమార్ కలిశారని, గాంధీ, గాడ్సే కలిసి వెళ్ళలేరని  ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2005 నుంచి బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉందని, నితీష్ కుమార్ పాలనను ప్రశ్నించడానికి ఎవరూ లేరని, ఇప్పుడు ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నానని అన్నారు ప్రశాంత్ కిషోర్.