Prashant Kishor ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయను..పీకే సంచలన ప్రకటన

Prashant Kishor  ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయను..పీకే సంచలన ప్రకటన

Prashant Kishor

Prashant Kishor పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు టీఎంసీ రెడీ అయింది. అయితే టీఎంసీ భారీ విజయం వెనుక ఆ పార్టీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీఎంసీ అద్భుత పదర్శన తర్వాత చాలా మంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రశాంత్ కిషోర్ ని అభివర్ణిస్తున్నారు.

అయితే ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనంటూ ప్రశాంత్ కిషోర్ సంచనల ప్రకటన చేశారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ… నేను చేస్తున్నదాన్ని ఇకపై కొనసాగించడానికి నేను ఇష్టపడను. నేను తగినంత చేశాను. నాకు ఇది విరామం తీసుకొని జీవితంలో ఇంకేమైనా చేయవలసిన సమయం. నేను ఈ స్పేస్(ఎన్నికల వ్యూహకర్త)ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. అయితే తిరిగి రాజకీయాల్లో చేరతారా అనే ప్రశ్నకు సమాధానంగా..నేను విఫలమైన రాజకీయ నాయకుడిని. తిరిగి వెళ్లి నేను ఏమి చేయాలో చూడాలి అని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడుతూ… ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా అనిపించినప్పటికీ, ఇది కఠినమైన పోరాటం అని అన్నారు. ఎన్నికల కమిషన్… పచ్చిగా పాక్షికంగా వ్యవహరించింది మరియు మా ప్రచారాన్ని కష్టతరం చేసింది. మేము చాలా బాగా చేయాలనే నమ్మకంతో ఉన్నాము మరియు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువ టిఎంసి గెలిచిందన్నారు. బీజేపీ నేతలు.. బెంగాల్ ను గెలవబోతున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాదరణ అంటే..బీజేపీ అన్ని ఎన్నికలలో విజయం సాధిస్తుందని అర్థం కాదు అని పోల్ స్ట్రాటజిస్ట్ తెలిపారు.

మరోవైపు, తృణముల్ కాంగ్రెస్ బెంగాల్‌లో భారీ మెజార్టీకి చేరుకోవడంతో గతేడాది డిసెంబరులో..బెంగాల్ ఎన్నికల్లొ బీజేపీ సీట్ల సంఖ్య రెండంకెలు దాటదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ట్వీట్ ని సేవ్ చేసుకోవాలని..తాను చెప్పినదానికన్నా బీజేపీ ఎక్కువసీట్లు సాధిస్తే తాను తన వృత్తిని వదిలేస్తానని పీకే డిసెంబర్ ట్వీట్ లో తెలిపారు.

కాగా, 2014లో కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి రావడంలో,2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడంలో, 2017 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో,2019లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో,2021లో వెస్ట్ బెంగాల్ లో మమత హ్యాట్రిక్ విక్టరీలో,తమిళనాడులో డీఎంకే విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.