ప్రశాంత్ కిషోర్‌కి అనూహ్యమైన ఆఫర్: ఆ పార్టీ నుంచి పిలుపు!

  • Published By: vamsi ,Published On : January 30, 2020 / 10:40 PM IST
ప్రశాంత్ కిషోర్‌కి అనూహ్యమైన ఆఫర్: ఆ పార్టీ నుంచి పిలుపు!

ప్రశాంత్ కిషోర్.. జేడీ(యూ) పార్టీ నుంచి బహిష్కరించబడిన నేత.. ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో బలమైన ప్రాంతీయ పార్టీతో సంబంధాలు… వాళ్లతో కలిసి జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణం ఏర్పాటు చెయ్యడమే లక్ష్యం..  ఈ క్రమంలో బీజేపీకే ఎదురెళ్లాడు. బీజేపీ మిత్రపక్షం అయిన జేడీ(యూ)లో ఉంటూనే బీజేపీని విమర్శించడంతో చివరకు పార్టీ నుంచి వెలివేయబడ్డాడు.

ఆ పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉండి బయటకు వచ్చిన ప్రశాంత్ కిషోర్‌కి ఇప్పుడు ఆఫర్లు భారీగానే వస్తున్నాయి. ఈ క్రమంలో జేడీయూ బహిష్కృత నేత, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు అనూహ్య ఆఫర్ లభించింది. పీకేకు అభ్యంతరం లేకపోతే తమ పార్టీలో వచ్చి చేరొచ్చంటూ ఆర్జేడీ స్వాగతించింది. ‘‘మా పార్టీలోకి పీకే రావొచ్చు. ఆయన రాకను స్వాగతిస్తాం. ప్రజలను, నేతలను హింసకు గురిచేయడం జేడీయూకు ముందునుంచీ అలవాటే. వారు ప్రశాంత్ కిశోర్‌ను వాడుకున్నారంతే’’ అని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.
 
అయితే తన భవిష్యత్ కార్యాచరణను ఫిబ్రవరి 11 తర్వాత వెల్లడిస్తానని, అప్పటి వరకూ మౌనంగా ఉంటానని పీకే తెలిపారు. మరోవైపు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అతనిని ఆహ్వానించింది అంటూ నెట్టింట్లో పుకార్లు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అప్పటి నుంచి వైఎస్ జగన్‌కు, ప్రశాంత్ కిశోర్‌కు మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.